Tejashwi Yadav: ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం.. బీహార్‌లో ఇండియా కూటమి హామీల వర్షం

Tejashwi Yadav Announces Jobs for Every Family in Bihar
  • బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల
  • వివాదాస్పద వక్ఫ్ (సవరణ) చట్టాన్ని రాష్ట్రంలో అడ్డుకుంటామని ప్రకటన
  • తాటి కల్లుపై నిషేధాన్ని ఎత్తివేస్తామని మరో కీలక హామీ
  • పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్
  • కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని మేనిఫెస్టోలో వెల్లడి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. మంగళవారం పాట్నాలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్జేడీ నేత, కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ ‘బీహార్ కా తేజస్వి ప్రణ్’ (తేజస్వి సంకల్పం) పేరుతో 32 పేజీల మేనిఫెస్టోను ఆవిష్కరించారు. అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఈ సందర్భంగా అతిపెద్ద హామీ ఇచ్చారు.

మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను వివరిస్తూ, తాము అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే ఉద్యోగ భద్రతకు కొత్త చట్టం తెస్తామని తేజస్వి యాదవ్ తెలిపారు. 20 నెలల్లోగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేస్తామని, 'జీవికా దీదీ'లను సైతం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి నెలకు రూ. 30,000 జీతం అందిస్తామని హామీ ఇచ్చారు.

వక్ఫ్ చట్టం.. కల్లుపై నిషేధం ఎత్తివేత
వివాదాస్పద వక్ఫ్ (సవరణ) చట్టాన్ని బీహార్‌లో అమలు చేయకుండా అడ్డుకుంటామని మేనిఫెస్టోలో స్పష్టం చేశారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మరింత పారదర్శకంగా, ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. బౌద్ధుల మనోభావాలకు అనుగుణంగా బోధ్‌గయ ఆలయాల నిర్వహణను బౌద్ధ సమాజానికే అప్పగిస్తామని పేర్కొన్నారు.

మరో కీలక హామీగా, రాష్ట్రంలో తాటి కల్లుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తామని తేజస్వి ప్రకటించారు. 2016 నుంచి అమల్లో ఉన్న మద్యపాన నిషేధ చట్టాన్ని సమీక్షిస్తామన్నారు. ఈ చట్టం కింద అన్యాయంగా జైళ్లలో మగ్గుతున్న దళితులు, పేదలకు తక్షణమే ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తరతరాలుగా కల్లు గీతనే నమ్ముకున్న వర్గాలకు జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్డీయేపై తేజస్వి విమర్శలు
ఈ సందర్భంగా అధికార ఎన్డీయే కూటమిపై తేజస్వి యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "ఎన్డీఏకు బీహార్ అభివృద్ధిపై ఎలాంటి విజన్ లేదు. అందుకే ఇంతవరకు మేనిఫెస్టో కూడా విడుదల చేయలేదు. బీజేపీ నేతలు, అవినీతి అధికారులు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను కీలుబొమ్మగా మార్చారు. నితీశ్ మళ్లీ సీఎం అభ్యర్థి కారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు" అని ఆరోపించారు. తమ మేనిఫెస్టో బీహార్ అభివృద్ధికి ఒక రోడ్‌మ్యాప్ అని, రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, వీఐపీ పార్టీ అధినేత ముఖేశ్ సహానీ తదితర ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం నుంచి బీహార్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని నేతలు తెలిపారు.
Tejashwi Yadav
Bihar election manifesto
India Alliance
government jobs
Vakf Act
liquor ban
Nitish Kumar
RJD
Bihar development
Pawan Khera

More Telugu News