Montha Cyclone: మొంథా తుపాన్ బీభత్సం.. అల్లకల్లోలంగా సముద్రం.. అంతర్వేదిలో లైట్‌హౌస్‌ను తాకుతున్న అలలు

Montha Cyclone Havoc Sea Surge Hits Lighthouse in Antarvedi
  • మొంథా తుపాన్ తీరం దాటడంతో కోనసీమ అతలాకుతలం
  • పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు
  • గుంటూరు, అనకాపల్లి జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం
మొంథా తుపాను అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీరం దాటిన తర్వాత కోస్తాంధ్ర అతలాకుతలమవుతోంది. తుపాను ప్రభావంతో పలు జిల్లాలు అస్తవ్యస్తంగా మారాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్ వద్ద సముద్రం భీకర రూపం దాల్చింది. సుమారు రెండు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడుతూ లైట్‌హౌస్‌ను తాకుతుండటంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

కోనసీమ జిల్లాలోని రాజోలు ప్రాంతంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా నిన్నటి నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులపై విరిగిపడిన చెట్లను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తొలగిస్తున్నాయి. పల్లిపాలెం గ్రామం పూర్తిగా జలమయం కావడంతో మత్స్యకార కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిన్న సాయంత్రం నుంచే నిలిపివేశారు.

మరోవైపు, తుపాను ప్రభావం ఇతర జిల్లాలపైనా తీవ్రంగా ఉంది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో ఏటిగట్లు ప్రమాదకరంగా మారాయి. భోగాపురం వద్ద ఉడేరు నదికి వరద పోటెత్తడంతో గట్లు కోతకు గురవుతున్నాయి. గండి పడితే సుమారు 500 ఎకరాల్లో పంట నష్టం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలోనూ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కంకుల దశలో ఉన్న వరి పైరు భారీ వర్షాలు, ఈదురు గాలులకు నేలకొరిగింది.

విజయవాడ నగరంలో కురుస్తున్న వర్షాలకు మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా కాలువలను శుభ్రం చేసే పనులను ఉదయం 5 గంటల నుంచే చేపట్టారు. వర్షం తీవ్రత తగ్గితేనే పరిస్థితి అదుపులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

తుపాను తీరం దాటిన నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలు, నష్టం అంచనాపై దృష్టి సారించింది. అధికారులు పంట నష్టం వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతమైన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Montha Cyclone
Andhra Pradesh
Cyclone Montha
Antarvedi
Konaseema District
Chandrababu Naidu
Coastal Andhra
flooding
crop damage
heavy rainfall

More Telugu News