India vs Australia: ఆసీస్‌తో నేడు తొలి టీ20.. భారత జట్టులో కీలక మార్పులు?

Suryakumar Yadav Captains India T20 Team Against Australia Key Changes Expected
  • కాన్‌బెర్రా వేదికగా నేడు మ్యాచ్
  • సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి టీమిండియా
  • ఆసియా కప్ గెలిచినా వన్డే సిరీస్ కోల్పోయిన భారత్
  • తుది జట్టులో అభిషేక్ శర్మ, హర్షిత్ రాణాలకు చోటు అంచనా
  • ఓపెనర్‌గా గిల్‌పై ఒత్తిడి.. పోటీలో సంజూ, జైస్వాల్
ఆసియా కప్ 2025లో అద్భుత ప్రదర్శనతో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ గెలిచిన టీమిండియా, ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఈరోజు కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన భారత్, పొట్టి ఫార్మాట్‌లో మాత్రం అదే జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

ఈ మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది. టీ20ల్లో టాప్ ర్యాంక్ బ్యాటర్ అయిన అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, ఆసియా కప్‌లో గిల్ పెద్దగా రాణించకపోవడంతో అతనిపై ఒత్తిడి నెలకొంది. ఓపెనర్ స్థానం కోసం సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ వంటి ఆటగాళ్లు పోటీలో ఉన్నందున గిల్ ఈ మ్యాచ్‌లో రాణించడం కీలకం.

మిడిలార్డర్‌లో ఆసియా కప్ హీరో తిలక్ వర్మ మూడో స్థానంలో, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నారు. వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌కు ఐదో స్థానంలో అవకాశం దక్కవచ్చని అంచనా. ఆల్-రౌండర్ల కోటాలో శివమ్ దూబే, అక్షర్ పటేల్ జట్టులో కీలక పాత్ర పోషించనున్నారు.

బౌలింగ్ విభాగానికి వస్తే, చివరి వన్డేలో అద్భుతంగా రాణించిన యువ పేసర్ హర్షిత్ రాణాకు తుది జట్టులో చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ పేస్ దళాన్ని నడిపించనున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తికి అవకాశం ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అనుభవజ్ఞుడైన కుల్దీప్ యాదవ్‌కు చోటు ద‌క్క‌క‌పోవచ్చని తెలుస్తోంది. వన్డే సిరీస్ ఓటమి తర్వాత ఈ టీ20 సిరీస్‌ను గెలిచి తిరిగి విజయాల బాట పట్టాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.

భారత తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
India vs Australia
Suryakumar Yadav
T20 Series
Shubman Gill
Sanju Samson
Tilak Varma
Harshit Rana
Cricket
Indian Cricket Team
T20 Cricket

More Telugu News