Cyclone Montha: తీరం దాటిన 'మొంథా' తుపాను

Cyclone Montha Crosses Coast in Andhra Pradesh
  • మచిలీపట్నం-కాకినాడ మధ్య తీరం దాటిన మొంథా తుపాను
  • నర్సాపురం సమీపంలో తీరాన్ని తాకినట్టు విపత్తుల సంస్థ వెల్లడి
  • రానున్న 6 గంటల్లో బలహీనపడనున్న తీవ్ర తుపాను
  • బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాలకు వర్ష సూచన
  • రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన 'మొంథా' తీవ్ర తుపాను తీరాన్ని దాటింది. మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 గంటల మధ్య మచిలీపట్నం-కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో ఇది తీరాన్ని దాటినట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.

ప్రస్తుతం భూభాగంపై ప్రవేశించిన ఈ తుపాను క్రమంగా బలహీనపడుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 6 గంటల్లో ఇది తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడనుందని వెల్లడించారు. తుపాను ప్రభావంతో బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం.. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. అలాగే కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.

తుపాను ప్రభావం రాయలసీమ జిల్లాలపై కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరుతో పాటు కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. తుపాను తీరం దాటినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. రాగ‌ల 24 గంట‌ల్లో ఏపీతో పాటు తెలంగాణ‌, ఒడిశా, కేర‌ళ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌ రాష్ట్రాల్లో కూడా వ‌ర్షాలు కుర‌వ‌నున్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది.
Cyclone Montha
Andhra Pradesh
Machilipatnam
Kakinada
Narsapuram
AP Disaster Management
Heavy Rains
Weather Forecast
Rayalaseema
Telangana

More Telugu News