Nara Lokesh: టెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తాం: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh to File Review Petition on TET Supreme Court Verdict
  • సచివాలయంలో మంత్రి లోకేశ్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలు
  • సుప్రీం తీర్పుపై ఉపాధ్యాయుల ఆవేదనను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేతలు
  • 2010కు ముందు నియమితులైన టీచర్లపై తీర్పు ప్రభావం
  • సుప్రీం ఉత్తర్వుల మేరకు ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ జారీ
  • టెట్ నిర్వహిస్తూనే, ఉపాధ్యాయుల కోసం న్యాయపోరాటం చేస్తామన్న మంత్రి
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ తీర్పుతో ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.

మంగళవారం నాడు సచివాలయంలో మంత్రి లోకేశ్ ను టీడీపీ ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ కలిశారు. 2010 అక్టోబర్ 23కు ముందు డీఎస్సీల ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు సుప్రీంకోర్టు తీర్పుతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వారి తరఫున ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని వారు మంత్రిని కోరారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, 2025 సెప్టెంబర్ 1 నాటికి ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 24న టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. 20 నుంచి 25 ఏళ్లుగా సర్వీసులో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు సైతం ఇప్పుడు టెట్ పాస్ కాకపోతే అనర్హులుగా మారే ప్రమాదం ఉందని, ఇది వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందని ఎమ్మెల్సీలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా, ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్నవారు ప్రమోషన్లు పొందాలన్నా టెట్ తప్పనిసరి అని పేర్కొన్న విషయాన్ని కూడా వారు వివరించారు.

ఎమ్మెల్సీలు చెప్పిన విషయాలపై స్పందించిన మంత్రి లోకేశ్, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం టెట్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో, ఉపాధ్యాయుల ఆకాంక్షలు, వారి సర్వీసును గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో కచ్చితంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
Nara Lokesh
TET exam
Teachers Eligibility Test
Supreme Court verdict
Review petition
AP Teachers
Teacher recruitment
Education Department
Alapati Rajendra Prasad
Bhumireddy Ramgopal Reddy

More Telugu News