Delhi Government: ఢిల్లీలో కురవనున్న కృత్రిమ వర్షం!

Delhi Government to Induce Artificial Rain to Combat Pollution
  • ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం
  • కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు వర్షం కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కసరత్తు
  • క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేసిన ఢిల్లీ ప్రభుత్వం
దేశ రాజధాని ఢిల్లీలో కృత్రిమ వర్షం కురిపించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీలో తీవ్రస్థాయిలో వాయు కాలుష్యం నమోదవుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. మంగళవారం ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ 306గా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. ఇది తీవ్రమైన కాలుష్యంగా పరిగణించబడుతోంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు స్థానికంగా కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఐఐటీ కాన్పూర్ నుంచి బయలుదేరిన ఎయిర్ క్రాఫ్ట్ సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ లాంటి రసాయన ఉత్ప్రేరకాలను వివిధ ప్రాంతాల్లోని మేఘాలపై చల్లి క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను పూర్తి చేసింది. ఫలితంగా మరికొన్ని గంటల్లో ఢిల్లీలో వర్షం కురిసే అవకాశం ఉంది.

ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య ఎప్పుడైనా ట్రయల్స్ నిర్వహించడానికి పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ అనుమతి ఇచ్చింది. ఈ ప్రక్రియను నిర్వహించడానికి అవసరమైన రూ. 3.21 కోట్ల బడ్జెట్‌ను ఢిల్లీ మంత్రివర్గం మే నెలలో ఆమోదించింది. అయితే ప్రతికూల వాతావరణం, రుతుపవన పరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ పలుమార్లు వాయిదాపడింది.
Delhi Government
Artificial rain
Delhi pollution
Cloud seeding
IIT Kanpur
Air quality index
Silver iodide

More Telugu News