Delhi Acid Attack Case: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో భారీ ట్విస్ట్... బాధితురాలే కుట్రపన్నినట్టు తేల్చిన పోలీసులు

Delhi Acid Attack Case Twist Victim Conspired Claims Police
  • ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో కీలక మలుపు
  • నిందితులుగా పేర్కొన్న ముగ్గురికి పోలీసుల క్లీన్ చిట్
  • బాధితురాలే దాడి నాటకం ఆడినట్లు నిర్ధారణ
  • పాత కక్షలతో ఇరికించేందుకు కుటుంబం కుట్ర
  • యువతి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తప్పుడు కేసు పెట్టినందుకు కుటుంబంపై చర్యలకు రంగం సిద్ధం
దేశ రాజధాని ఢిల్లీలో గత వారం సంచలనం సృష్టించిన యాసిడ్ దాడి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఓ యువతిపై యాసిడ్ దాడి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పెయింటర్ సహా ముగ్గురు వ్యక్తులకు ఢిల్లీ పోలీసులు వర్చువల్ క్లీన్ చిట్ ఇచ్చారు. అసలు యాసిడ్ దాడి జరగలేదని, పాత కక్షల కారణంగా నిందితులను ఇరికించేందుకు, బాధితురాలిగా చెప్పుకుంటున్న యువతే తన కుటుంబంతో కలిసి ఈ నాటకం ఆడిందని దర్యాప్తులో తేలింది.

ఈ కేసుకు సంబంధించి స్పెషల్ పోలీస్ కమిషనర్ రవీంద్ర సింగ్ యాదవ్ మంగళవారం కీలక వివరాలు వెల్లడించారు. ఉత్తర ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో అక్టోబర్ 26న తనపై యాసిడ్ దాడి జరిగిందని ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనలో పెయింటర్ జితేందర్, అతని సహాయకులు ఇషాన్, అర్మాన్‌లను నిందితులుగా పేర్కొంది. దీనిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 124(1), 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే, సీసీటీవీ ఫుటేజ్, టెక్నికల్ అనాలిసిస్, ఇతర ఆధారాలను పరిశీలించగా.. ఘటన జరిగిన సమయంలో నిందితులు ముగ్గురూ ఆ ప్రదేశంలో లేరని స్పష్టమైంది. "యువతి తండ్రికి, నిందితులకు మధ్య ఓ ప్లాట్ విషయంలో పాత తగాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారిని తప్పుడు కేసులో ఇరికించేందుకు యువతి, ఆమె తండ్రి, సోదరుడు, అంకుల్ కలిసి ఈ కుట్ర పన్నారు" అని రవీంద్ర సింగ్ యాదవ్ వివరించారు.

దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. యాసిడ్ దాడి ఘటనకు కొద్ది రోజుల ముందు నిందితుల్లో ఒకరైన జితేందర్ భార్య.. యువతి తండ్రి అకిల్ ఖాన్ (45)పై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఈ నేపథ్యంలోనే కక్ష సాధింపు చర్యగా ఈ యాసిడ్ దాడి నాటకం ఆడారని పోలీసులు భావిస్తున్నారు. కుట్రలో భాగమైన అకిల్ ఖాన్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

దాడి జరిగినట్టు నమ్మించేందుకు, ఆసుపత్రిలో చేరేందుకు టాయిలెట్ క్లీనర్‌ను చేతులపై పోసుకున్నట్లు యువతి విచారణలో చెప్పిందని, ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. "ముగ్గురు అమాయకులను అన్యాయంగా కేసులో ఇరికించే కుట్రను భగ్నం చేయడం సంతృప్తినిచ్చింది. తప్పుడు ఫిర్యాదు చేసిన యువతి, ఆమె కుటుంబ సభ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయంపై న్యాయసలహా తీసుకుంటున్నాం" అని రవీంద్ర సింగ్ యాదవ్ పేర్కొన్నారు.
Delhi Acid Attack Case
Acid attack case
Delhi police
Ravindra Singh Yadav
Jitender
Ashok Vihar
Fake case
Conspiracy
Crime news
Akiel Khan

More Telugu News