Jogi Ramesh: తాడేపల్లి డైరెక్షన్‌లోనే జోగి రమేశ్ ప్రమాణాల డ్రామా: ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్

Tadepalli Direction Behind Jogi Ramesh Drama Says Kagita
  • కూటమి ప్రభుత్వ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఈ నాటకాలు అంటూ కృష్ణప్రసాద్ ఫైర్
  • తాడేపల్లి డైరెక్షన్ ప్రకారమే జోగి రమేశ్ నడుచుకుంటున్నారని వ్యాఖ్యలు
  • నకిలీ మద్యం కేసులో సాక్ష్యాలతో దొరికిపోయారని స్పష్టీకరణ
  • ఎన్ని ప్రమాణాలు చేసినా శిక్ష తప్పదన్న ఎమ్మెల్యే
వైసీపీ నేత జోగి రమేశ్ ప్రమాణాల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపారని, దీని వెనుక తాడేపల్లి డైరెక్షన్ ఉందని పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే జోగి రమేశ్ ఇలాంటి నాటకాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

జోగి రమేశ్ కు అసలు వ్యక్తిత్వమే లేదని కాగిత కృష్ణప్రసాద్ ధ్వజమెత్తారు. "గతంలో చంద్రబాబు గారి ఇంటిపై దాడి చేసి దొడ్డిదారిలో మంత్రి పదవి సంపాదించుకున్న వ్యక్తి జోగి రమేశ్. పెడన ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గాన్ని ఎలా దోచుకున్నారో ప్రజలందరికీ తెలుసు. పెనమలూరు ప్రజలు కూడా ఆయన వ్యక్తిత్వం ఏంటో చూశారు" అని ఆయన వ్యాఖ్యానించారు.

నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయారని కాగిత కృష్ణప్రసాద్ ఆరోపించారు. "అమాయకుల ప్రాణాలను బలిగొనేందుకు ప్రయత్నించి, ఇప్పుడు సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. ఈ కేసులో ఎన్ని ప్రమాణాలు చేసినా, ఎన్ని వేషాలు వేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరు" అని ఆయన హెచ్చరించారు.

నీచ రాజకీయాల కోసం సొంత కుటుంబసభ్యులను కూడా రోడ్డుపైకి తీసుకువచ్చిన ఘనత జోగి రమేశ్ కే దక్కుతుందని కాగిత కృష్ణప్రసాద్ ఎద్దేవా చేశారు. తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాలతోనే జోగి రమేశ్ ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని ఆయన తెలిపారు.
Jogi Ramesh
Kagita Krishna Prasad
Tadepalli
Penamaluru
YSRCP
TDP
Andhra Pradesh Politics
Fake Liquor Case
Chandrababu Naidu
Oath Drama

More Telugu News