Chandrababu Naidu: జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు సమీక్ష... సరిదిద్దాలని నిర్ణయం

Chandrababu Naidu Reviews District Reorganization in Andhra Pradesh
  • గత ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చనున్న కూటమి సర్కారు
  • జిల్లాల పునర్విభజనపై కసరత్తు
  • గత ప్రభుత్వ విభజన అశాస్త్రీయంగా జరిగిందన్న ముఖ్యమంత్రి
  • జిల్లాల విభజనను సరిదిద్దాల్సిన అవసరం ఉందని స్పష్టం
  • ఇప్పటికే ప్రజాసంఘాల నుంచి వినతులు స్వీకరించిన ఉప సంఘం
  • సరిహద్దుల మార్పుపై త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, దానిని సరిదిద్దే చర్యలకు ఉపక్రమించారు. ఈ అంశంపై మంగళవారం ఆయన మంత్రివర్గ ఉప సంఘంతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు, జిల్లాల పునర్విభజనపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు హాజరయ్యారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్థన్ రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.

గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన అశాస్త్రీయ పద్ధతిలో జరిగిందని, దానివల్ల పరిపాలనాపరమైన ఇబ్బందులతో పాటు ప్రజలు కూడా అసౌకర్యానికి గురవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ విభజనను తక్షణమే సరిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై మంత్రివర్గ ఉప సంఘం పలుమార్లు సమావేశమైంది. జిల్లాల సరిహద్దుల మార్పులకు సంబంధించి వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వచ్చిన వినతులను, అభ్యంతరాలను స్వీకరించి నివేదిక సిద్ధం చేస్తోంది.

ఈ సమావేశంలో ఉప సంఘం ఇప్పటివరకు జరిపిన కసరత్తును ముఖ్యమంత్రికి వివరించినట్లు సమాచారం. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ, శాస్త్రీయంగా, పరిపాలనకు సౌలభ్యంగా ఉండేలా కొత్త సరిహద్దులను నిర్ణయించాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది. ఉప సంఘం నివేదిక ఆధారంగా ప్రభుత్వం త్వరలోనే జిల్లాల పునర్విభజనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Chandrababu Naidu
Andhra Pradesh
districts reorganization
Pawan Kalyan
district borders
administration
ministerial sub-committee
public opinion
new districts
AP districts

More Telugu News