Nara Lokesh: మొంథా తుపాను: అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆర్టీజీఎస్ నుంచి మంత్రి లోకేశ్‌ సమీక్ష

Nara Lokesh Reviews Montha Cyclone Preparedness from RTGS
  • మొంథా తుపానుపై ఆర్టీజీఎస్ నుంచి మంత్రి లోకేశ్‌ సమీక్ష
  • సమీక్షలో పాల్గొన్న హోంమంత్రి అనిత, ఉన్నతాధికారులు
  • ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశం
  • తుపాను ప్రభావంతో పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు
  • సహాయక చర్యల్లో పాల్గొనాలని కూటమి శ్రేణులకు పిలుపు
మొంథా తుపాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుపానును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి లోకేశ్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు మంత్రి లోకేశ్‌కు వివరించారు. తుపాను ఏ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందనే వివరాలను లోకేశ్‌ ఆరా తీశారు. అలాగే, నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో నమోదైన వర్షపాతం లెక్కలను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రి లోకేశ్‌ అధికారులను ఆదేశించారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కూటమి నేతలు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. తుపాను వల్ల పంటలకు వాటిల్లే నష్టంపై కూడా మంత్రి ఆరా తీశారు. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Nara Lokesh
Montha Cyclone
Andhra Pradesh
AP Government
Cyclone Relief
RTGS
Vangalapudi Anita
Konaseema
Horticulture Crops
Rainfall

More Telugu News