Darshan Singh Sahsi: కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త దారుణ హత్య.. ఇంటి బయటే కాల్చివేత

Darshan Singh Sahsi Indian Origin Businessman Murdered in Canada
  • కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త దర్శన్ సింగ్ సాహ్సీ హత్య
  • ఇంటి బయట కారులో కూర్చున్న సమయంలో దుండగుడి కాల్పులు
  • పంజాబ్‌లోని లుధియానా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
  • ప్రపంచ ప్రసిద్ధ క్లాతింగ్ రీసైక్లింగ్ సంస్థకు అధ్యక్షుడిగా బాధ్యతలు
కెనడాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, 'కానమ్ ఇంటర్నేషనల్' అధ్యక్షుడు దర్శన్ సింగ్ సాహ్సీ (68) కాల్పుల్లో మరణించారు. బ్రిటిష్ కొలంబియాలోని అబాట్స్‌ఫోర్డ్‌లో ఆయన నివాసం వెలుపల ఈ ఘటన జరిగింది. కారులో కూర్చుంటున్న సమయంలో ఓ దుండగుడు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయినట్లు తెలుస్తోంది.

అబాట్స్‌ఫోర్డ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ వివరాల ప్రకారం, సోమవారం ఉదయం 9:22 గంటలకు రిడ్జ్‌వ్యూ డ్రైవ్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి, కారులో ఉన్న సాహ్సీ తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రథమ చికిత్స సిబ్బంది వెంటనే వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు ధ్రువీకరించారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, విచారణ ప్రాథమిక దశలో ఉందని సార్జెంట్ పాల్ వాకర్ తెలిపారు. కేసును అబాట్స్‌ఫోర్డ్ మేజర్ క్రైమ్ యూనిట్ నుంచి ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు బదిలీ చేశామని, తదుపరి వివరాలను వారే వెల్లడిస్తారని పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా సమీపంలోని మూడు పాఠశాలలకు కొద్దిసేపు షెల్టర్-ఇన్-ప్లేస్ ప్రోటోకాల్ అమలు చేశారు.

దర్శన్ సింగ్ సాహ్సీ పంజాబ్‌లోని లుధియానా జిల్లా, రాజ్‌గఢ్ గ్రామానికి చెందినవారు. ఒక రైతు కుటుంబానికి చెందిన ఆయన 1991లో కెనడాకు వలస వెళ్లి, వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన స్థాపించిన కానమ్ గ్రూప్, ప్రపంచంలోని అతిపెద్ద క్లాతింగ్ రీసైక్లింగ్ కంపెనీలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆయన గుజరాత్‌లోని కాండ్లాలో కూడా వ్యాపారం నిర్వహిస్తున్నారు. సాహ్సీ ఉదార స్వభావం కలిగిన వ్యక్తిగా పేరు పొందారు. తన సంస్థలో ఎక్కువ మంది పంజాబీలకు ఉపాధి కల్పించారు.
Darshan Singh Sahsi
Indian businessman Canada
Abbotsford shooting
Kanem International
British Columbia crime
Ludhiana Punjab
Clothing recycling
Homicide investigation
Canada crime news

More Telugu News