AP Schools: ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు.. ఏపీలో భారీగా పెరిగిన సింగిల్ టీచర్ స్కూళ్లు

Single Teacher Schools Increased in Andhra Pradesh
  • ఏపీలో 12,912కు చేరిన ఏకోపాధ్యాయ పాఠశాలలు
  • వైసీపీ అధికారంలోకి రాకముందు ఈ సంఖ్య 7 వేలలోపే
  • ఈ పాఠశాలల్లో సగటున 15 మందే విద్యార్థులు
  • రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల సగటు విద్యార్థుల సంఖ్య 138
  • కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన యూడైస్ 2024-25 నివేదికలో వెల్లడి
ఏపీలో ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్న బడుల సంఖ్య దాదాపు 13 వేలకు చేరినట్లు కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన ‘యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్’ (యూడైస్) 2024-25 నివేదిక స్పష్టం చేసింది. గత ఐదేళ్లలో ఈ సంఖ్య భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

వివరాల్లోకి వెళితే... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 7 వేల లోపు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, 2024-25 విద్యా సంవత్సరానికి ఆ సంఖ్య 12,912కు ఎగబాకింది. ఈ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో కేవలం 1,97,113 మంది విద్యార్థులు మాత్రమే చదువుకున్నారు. అంటే ఒక్కో పాఠశాలలో సగటున కేవలం 15 మంది విద్యార్థులే ఉన్నారన్నమాట.

ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 61,317 పాఠశాలలు, జూనియర్ కాలేజీలను పరిగణనలోకి తీసుకుంటే, 1 నుంచి 12వ తరగతి వరకు 84.54 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో ప్రతి విద్యాసంస్థలో సగటున 138 మంది విద్యార్థులు ఉండగా, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో మాత్రం ఈ సంఖ్య కేవలం 15కే పరిమితం కావడం గమనార్హం. రాష్ట్ర సగటుతో పోలిస్తే ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది.

యూడైస్ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పది మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలలు 9.8 శాతం ఉండగా, 11 నుంచి 20 మంది విద్యార్థులున్నవి 12.9 శాతంగా ఉన్నాయి. అలాగే, 21 నుంచి 30 మంది ఉన్న బడులు 15.8 శాతంగా నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో కలిపి మొత్తం 3,42,721 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.
AP Schools
Andhra Pradesh education
Single teacher schools
YSRCP government
UDISE report
School enrollment
Education statistics Andhra Pradesh
Teacher shortage
Education in AP

More Telugu News