Subhash Chandra Garg: రాష్ట్రం కోసం చంద్రబాబు పట్టుదల అది... కేంద్ర మాజీ అధికారి పుస్తకంలో ఆసక్తికర వ్యాఖ్యలు

Subhash Chandra Garg Book Highlights Chandrababus Focus on Andhra Pradesh
  • వాజపేయి హయాంలో ఏపీకి చంద్రబాబు భారీగా నిధులు తెచ్చారని వెల్లడి
  • 'నో, మినిస్టర్' పుస్తకంలో ఆసక్తికర విషయాలు రాసిన మాజీ అధికారి సుభాష్ చంద్ర గార్గ్
  • ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టుల్లో 40 శాతానికి పైగా ఏపీకే దక్కేవి
  • పనికి ఆహార పథకంలో 53 శాతం బియ్యం వాటాను సాధించిన చంద్రబాబు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యంత పట్టుదలగా వ్యవహరించేవారని వెల్లడి
  • తన బదిలీకి కూడా చంద్రబాబు ప్రయత్నించారన్న‌ గార్గ్
వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీది కీలక పాత్ర. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు, తనకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి అసాధారణ స్థాయిలో నిధులు, ప్రాజెక్టులు సాధించుకున్నారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వెల్లడించారు. తాను రాసిన 'నో, మినిస్టర్' అనే పుస్తకంలో ఆనాటి పరిస్థితులను, రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు పడిన తపనను ఆయన వివరించారు. వాజపేయి హయాంలో కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్‌గా పనిచేసిన గార్గ్, చంద్రబాబు పాలనా దక్షత, రాజకీయ చతురత గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అన్నీ ఆంధ్రాకే..
1999-2000 మధ్య కాలంలో ప్రపంచ బ్యాంకు భారతదేశానికి ఆమోదించిన మొత్తం ప్రాజెక్టుల్లో 40 శాతానికి పైగా చంద్రబాబు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే మళ్లించుకున్నారని గార్గ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. "ఆ సమయంలో భారత ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు కేవలం ఏపీ కోసమే పనిచేస్తున్నాయా అనిపించేది. వాజపేయి ప్రభుత్వానికి టీడీపీ కీలక మద్దతుదారు కావడంతో చంద్రబాబు మాటకు తిరుగుండేది కాదు. వివిధ ప్రాజెక్టుల కింద నిధుల కోసం ఆయన నా రక్తం పీల్చేశారు. రాష్ట్రం కోసం ఆయన అత్యంత స్వార్థపూరితంగా వ్యవహరించేవారు" అని గార్గ్ రాసుకొచ్చారు. తక్కువ ఆదాయం ఉన్న రాష్ట్రాల కోసం ఉద్దేశించిన చౌక రుణాలను సైతం చంద్రబాబు ఏపీకి దక్కించుకున్నారని తెలిపారు.

వంద శాతం గ్రాంట్‌గా మార్పు
2001లో ప్రపంచ బ్యాంకుతో కుదిరిన 250 మిలియన్ డాలర్ల ఏపీ స్ట్రక్చరల్‌ అడ్జ్‌స్టమెంట్‌ లోన్‌ ఒప్పందంలో నిబంధనలను సైతం చంద్రబాబు మార్పించగలిగారని గార్గ్ వివరించారు. సాధారణంగా కేంద్రం నుంచి రుణం, గ్రాంట్ నిష్పత్తి 70:30గా ఉండాలని, కానీ బ్రిటన్‌కు చెందిన డీఎఫ్‌ఐడీ నుంచి వచ్చే 100 మిలియన్ డాలర్ల మొత్తాన్ని 100 శాతం గ్రాంట్‌గా మార్చేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించిందని తెలిపారు. తాను ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినా, కేవలం రెండు రోజులకే కేంద్ర ఆర్థిక మంత్రి ఆ ఫైలుపై సంతకం చేశారని, ఏపీకి ప్రత్యేక మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేసుకున్నారు.

పనికి ఆహార పథకంలో సింహభాగం
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 'పనికి ఆహార పథకం'లోనూ చంద్రబాబు సింహభాగం ఏపీకే దక్కించుకున్నారని గార్గ్ తెలిపారు. 2001-2002 మధ్య కేంద్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకు 40 లక్షల టన్నుల బియ్యాన్ని కేటాయిస్తే, అందులో ఒక్క ఏపీనే 21.5 లక్షల టన్నులు (53%) పొందింది. ఆ తర్వాత అదనంగా మరో 10 లక్షల టన్నులు కూడా సాధించుకుంది. మిగతా రాష్ట్రాలకు కేంద్ర గ్రాంట్లు 2.6 శాతం పెరిగితే, ఒక్క ఏపీ వాటా మాత్రం 34 శాతం పెరిగిందంటే చంద్రబాబు రాష్ట్రం కోసం కేంద్రంపై ఎంత ఒత్తిడి తెచ్చారో అర్థం చేసుకోవచ్చని అన్నారు.

తన బదిలీకి ప్రయత్నించారు
ఏపీకి నిధుల కేటాయింపులో తాను అడ్డుపడుతున్నానని భావించి, తనను ఆ పదవి నుంచి తప్పించడానికి కూడా చంద్రబాబు ప్రయత్నించారని గార్గ్ ఆరోపించారు. అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ ప్రైవేట్ సెక్రటరీ ద్వారా ఈ విషయం తనకు తెలిసిందని, అప్పటి ఏపీ ఆర్థిక కార్యదర్శి వి.ఎస్. సంపత్ తన బదిలీ కోసం ఆరా తీశారని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.
Subhash Chandra Garg
Chandrababu
No Minister book
Andhra Pradesh funds
AP projects
Vajpayee government
World Bank projects
AP structural adjustment loan
Food for Work program
VS Sampath

More Telugu News