Cyclone Montha: మొంథా తుఫాను ఎఫెక్ట్.. రికార్డు స్థాయిలో 100 రైళ్లు రద్దు

Cyclone Montha Hits Transport 100 Trains Cancelled
  • మొంథా తుఫాను ప్రభావంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం
  • విజయవాడ డివిజన్‌లోనే రికార్డు స్థాయిలో 100 రైళ్లు రద్దు
  • ఆర్టీసీ బస్సు సర్వీసులపై స్వల్ప ప్రభావం.. 22 బస్సులు నిలిపివేత
  • రైళ్ల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు.. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు
  • నేటి పరిస్థితిని బట్టి మరిన్ని బస్సులు రద్దయ్యే అవకాశం
మొంథా తుఫాను తీరం దాటక ముందే రవాణా వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రైల్వే వ్యవస్థ దాదాపు స్తంభించిపోయింది. విజయవాడ కేంద్రంగా పలు రైళ్లు, ఆర్టీసీ బస్సులు, విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రైల్వే శాఖ రికార్డు స్థాయిలో 100కు పైగా రైళ్లను రద్దు చేసింది. ఒక్క విజయవాడ డివిజన్ పరిధిలోనే 95 రైళ్లను నిలిపివేస్తున్నట్లు అధికారులు మూడు బులెటిన్ల ద్వారా ప్రకటించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, గుంటూరు, తెనాలి, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాలకు వెళ్లే సర్వీసులతో పాటు భువనేశ్వర్, చెన్నై, హౌరా, బెంగళూరు వంటి దూరప్రాంత రైళ్లను కూడా రద్దు చేశారు. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక రిఫండ్ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రోడ్డు రవాణాపై తుఫాను ప్రభావం రైల్వేతో పోలిస్తే కాస్త తక్కువగానే ఉంది. విజయవాడ నుంచి విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి వెళ్లే 22 ఆర్టీసీ బస్సు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. అయితే, రవాణా శాఖ తనిఖీల కారణంగా ప్రైవేట్ బస్సులు చాలావరకు రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికుల ఒత్తిడి ఆర్టీసీపై పడుతోంది. మంగళవారం నాటి తుఫాను పరిస్థితిని బట్టి మరిన్ని సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Cyclone Montha
Vijayawada
Indian Railways
Train cancellations
RTC buses
Bus services cancelled
Andhra Pradesh
Visakhapatnam
Transportation

More Telugu News