Nara Lokesh: డేటా సెంటర్ సలహా మండలిని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం... చైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్

Nara Lokesh to Chair AP Data Center Advisory Council
  • విశాఖను డేటా సెంటర్ల హబ్‌గా మార్చేందుకు సలహా మండలి ఏర్పాటు
  • 2030 నాటికి 6000 మెగావాట్ల సామర్థ్యమే లక్ష్యంగా నిర్ణయం
  • మంత్రి నారా లోకేశ్ అధ్యక్షతన పనిచేయనున్న అడ్వైజరీ కౌన్సిల్
  • గూగుల్, సిఫీ వంటి సంస్థల పెట్టుబడులను వేగవంతం చేసేందుకు చర్యలు
  • మైక్రోసాఫ్ట్, ఎన్టీటీ, జియో వంటి దిగ్గజ కంపెనీలకు మండలిలో చోటు
  • ఏఐ యుగంలో విశాఖను దేశానికే డేటా హబ్‌గా మారుస్తామన్న లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌ను, ముఖ్యంగా విశాఖపట్నం నగరాన్నిఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యుగానికి అవసరమైన డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. 2030 నాటికి 6,000 మెగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా 'డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్'ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ మండలికి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో గూగుల్ (1 గిగావాట్), సిఫీ ఇన్ఫినిటీ (550 మెగావాట్లు) వంటి దిగ్గజ సంస్థలు ప్రకటించిన భారీ పెట్టుబడులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయడమే ఈ కౌన్సిల్ ప్రధాన ఉద్దేశం. దీని ద్వారా విశాఖలో భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, ప్రపంచ పెట్టుబడిదారుల్లో మరింత విశ్వాసం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సలహా మండలి... విద్యుత్, పునరుత్పాదక ఇంధన అనుసంధానం, హై-స్పీడ్ ఫైబర్ కనెక్టివిటీ, ప్రత్యేక డేటా సెంటర్ పార్కులు, అనుమతుల సరళీకరణ, రియల్ ఎస్టేట్ నిబంధనలు, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక అంశాలపై ప్రభుత్వానికి మార్గనిర్దేశం చేయనుంది. 'ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ 4.0'కు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించి, ఒప్పందాలు కుదిరిన నాటి నుంచి నిర్మాణం, కార్యకలాపాలు ప్రారంభమయ్యే వరకు వేగంగా పనులు జరిగేలా ఈ కౌన్సిల్ పర్యవేక్షిస్తుంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మండలిలో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలకు స్థానం కల్పించారు. క్లౌడ్, ఏఐ రంగంలో మైక్రోసాఫ్ట్ అజూర్, గ్లోబల్ ఆపరేషన్స్‌లో ఎన్టీటీ, ఎస్టీ టెలీమీడియా, ల్యాండ్ అడ్వైజరీ కోసం కుష్‌మ్యాన్ అండ్ వేక్‌ఫీల్డ్, జేఎల్‌ఎల్, కనెక్టివిటీ కోసం జియో ప్లాట్‌ఫామ్స్, పవర్, కూలింగ్ కోసం ష్నైడర్ ఎలక్ట్రిక్ వంటి సంస్థల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్రం నుంచి పై డేటా సెంటర్స్ ప్రతినిధికి కూడా చోటు కల్పించారు. వీరితో పాటు నాస్కామ్, డీఎస్‌సీఐ, ఐఈఈఎంఏ వంటి పారిశ్రామిక సంఘాలు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఐఐఎం విశాఖపట్నం, ఐఐటీ తిరుపతి వంటి విద్యాసంస్థల ప్రతినిధులు కూడా ఈ కౌన్సిల్‌లో భాగస్వాములు కానున్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ, "ఏఐ యుగంలో డేటా అనేది కొత్త ఆయిల్ లాంటిది. డేటా సెంటర్లే కొత్త రిఫైనరీలు. ఇప్పటికే గూగుల్, సిఫీ వంటి సంస్థలు విశాఖలో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. ఈ అడ్వైజరీ కౌన్సిల్ మార్గదర్శకాలతో విశాఖను దేశంలోనే డేటా సెంటర్ల రాజధానిగా తీర్చిదిద్దుతాం" అని ధీమా వ్యక్తం చేశారు. సరైన విధానాలు, అనుమతులతో ఏఐ ఆధారిత మౌలిక వసతుల కల్పనలో విశాఖను అత్యంత పోటీతత్వమున్న నగరంగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు.
Nara Lokesh
Andhra Pradesh
Data Center Advisory Council
Visakhapatnam
Data Centers
Artificial Intelligence
Google
Sify
AP Data Center Policy 4.0
Information Technology

More Telugu News