Election Commission of India: 'ఎస్ఐఆర్'పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన

Election Commission of India Announces Key Update on SIR
  • బీహార్‌లో ఎస్ఐఆర్ విజయవంతమైందన్న ప్రధాన ఎన్నికల కమిషనర్
  • రెండో దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహిస్తామని వెల్లడి
  • 21 ఏళ్ల కింద ఓటర్ల జాబితా సవరణ జరిగిందన్న జ్ఞానేశ్ కుమార్
ఎస్ఐఆర్‌ (SIR - ప్రత్యేక సమగ్ర సవరణ)పై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం కీలక ప్రకటన చేసింది. బీహార్‌లో ఎస్ఐఆర్ విజయవంతమైందని, మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని నిర్వహించబోతున్నామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతూ, రెండో దశ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను త్వరలో చేపట్టనున్నామని వెల్లడించారు.

1951 నుంచి 2004 వరకు ఎనిమిదిసార్లు ఎస్ఐఆర్ నిర్వహించారని అన్నారు. 21 ఏళ్ల కిందట ఓటర్ల జాబితా సవరణ జరిగిందని గుర్తు చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా నకిలీ ఓట్లు, అక్రమ వలసదారులు, చనిపోయిన, బదిలీ చేయబడిన ఓటర్లను తొలగించినట్లు వెల్లడించారు. ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

బీహార్‌లో 7.5 కోట్ల మందితో ఎస్ఐఆర్ విజయవంతంగా పూర్తయిందని అన్నారు. బీహార్‌లో ఈ ప్రక్రియపై ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదని తెలియజేశారు. రెండో దశలోనూ ప్రతి ఇంటికి మూడుసార్లు వెళ్లి ఓటరుపై నిర్ధారణ చేసుకుంటామని తెలిపారు. ఎస్ఐఆర్‌పై రాజకీయ అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు.

రెండో దశలో ప్రత్యేక సమగ్ర సవరణ జరగనున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు: అండమాన్ నికోబర్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్. రెండో దశ ఎస్ఐఆర్ జరగనున్న రాష్ట్రాల్లో 51 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని, నవంబర్ 4వ తేదీ నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. అసోంలో ఎన్ఆర్‌సీ ఉన్నందున ఎస్ఐఆర్ లేదని స్పష్టం చేశారు.
Election Commission of India
SIR
Special Integrated Revision
Voter list revision
Bihar SIR success

More Telugu News