Nara Lokesh: 'మొంథా' ముంచుకొస్తోంది... మంత్రి నారా లోకేశ్ కు కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు

Nara Lokesh Given Key Responsibilities for Montha Cyclone Relief
  • బంగాళాఖాతంలో మొంథా తుపాను
  • ఏపీ తీరం దిశగా పయనం
  • సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
  • పీఎంవో కార్యాలయంతో సమన్వయం చేసుకునే బాధ్యతలు లోకేశ్ కు అప్పగింత
మొంథా తుఫాన్ రూపంలో ముంచుకొస్తున్న పెను విపత్తును ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. సహాయక చర్యలను మరింత సమర్థంగా, వేగంగా చేపట్టే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు... మంత్రి నారా లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. తుపాను సహాయక చర్యలకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)తో సమన్వయం చేసుకునే గురుతర బాధ్యతను లోకేశ్‌కు కేటాయించారు. కేంద్రం నుంచి అవసరమైన సహాయాన్ని ఎప్పటికప్పుడు రాబట్టడం, రాష్ట్రంలోని పరిస్థితులను కేంద్రానికి నివేదించడం వంటి అంశాలను లోకేశ్ పర్యవేక్షించనున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించి సమన్వయం చేయనున్నారు.

గంట గంటకూ ప్రజలకు సమాచారం

సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంథా తుపాను‌పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను సమయంలో ఒక్క ప్రాణం కూడా పోకూడదని, ఆస్తి నష్టాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం కావాలని ఆయన స్పష్టం చేశారు. తుఫాన్ కదలికలు, తాజా పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు రియల్ టైమ్‌లో సమాచారం అందించాలని ఆదేశించారు. మంగళవారం ఉదయం నుంచి ప్రతీ గంటకూ ఒక బులిటెన్ విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. సమాచార వ్యవస్థకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు శాటిలైట్ ఫోన్లు వాడాలని, అవసరమైన చోట ప్రత్యేకంగా మొబైల్ టవర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.

తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న 2,707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడితే, పవర్ బ్యాకప్ కోసం 3,211 జెనరేటర్లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి 25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.

అతి భారీ వర్షాలకు అవకాశం

ప్రస్తుతం కాకినాడకు 680 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మొంథా తుపాను, గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోందని అధికారులు సీఎంకు వివరించారు. దీని ప్రభావంతో ఇప్పటికే కోస్తాంధ్రలో వర్షాలు మొదలయ్యాయని, మంగళవారం కృష్ణా జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేశారు. మంగళవారం రాత్రికి తుపాను తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించామని, సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులందరినీ వెనక్కి రప్పించామని తెలిపారు.

అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తం

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని, అగ్నిమాపక సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. రహదారులు దెబ్బతిన్నా, విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలినా వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు అవసరమైన యంత్రాంగం, సామగ్రిని సిద్ధం చేయాలన్నారు. తుఫాన్ అనంతరం పారిశుధ్య లోపంతో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణులు, బాలింతల కోసం 108, 104 వాహనాలను అందుబాటులో ఉంచాలని, అన్ని పీహెచ్‌సీల్లో యాంటీ స్నేక్ వెనోమ్, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు ఉండేలా చూడాలన్నారు. పంట నష్టం జరగకుండా రైతులకు టార్పాలిన్లు పంపిణీ చేయాలని, పశుసంపదను కాపాడాలని చెప్పారు.

గతంలో వచ్చిన తిత్లీ, హుద్‌హుద్ వంటి తుపాన్ల అనుభవాన్ని పాఠంగా తీసుకుని పనిచేయాలని అధికారులకు సూచించారు. విధుల్లో అలసత్వం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Nara Lokesh
Montha cyclone
Andhra Pradesh
Cyclone relief
Chandrababu Naidu
AP government
Weather updates
Coastal Andhra
Heavy rains
Disaster management

More Telugu News