Delhi Acid Attack: ఢిల్లీ యాసిడ్ దాడిలో బిగ్ ట్విస్ట్.. బాధితురాలి తండ్రిపైనే నిందితుడి భార్య ఫిర్యాదు

Twist In Delhi Acid Attack Accuseds Wife Says Survivors Father Raped Her
  • ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో ఊహించని మలుపు
  • బాధితురాలి తండ్రిపై లైంగిక ఆరోపణలు చేసిన ప్రధాన నిందితుడి భార్య
  • వేధింపులను ప్రశ్నించినందుకే యువతిపై యాసిడ్ దాడి
  • పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసుల గాలింపు
  • రెండు కేసులపైనా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించిన పోలీసులు
ఢిల్లీలో ఓ యువతిపై జరిగిన యాసిడ్ దాడి కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి భార్య.. ఏకంగా బాధితురాలి తండ్రిపైనే లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్ ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో తాను ఆయన వద్ద పనిచేసేటప్పుడు తనను లైంగికంగా వాడుకుని, ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ కొత్త పరిణామంతో యాసిడ్ దాడి కేసు దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారింది.

వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్‌లో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై నిన్న యాసిడ్ దాడి జరిగిన విషయం తెలిసిందే. లక్ష్మీబాయి కాలేజీ సమీపంలో మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను అడ్డగించారు. ప్రధాన నిందితుడు ఇషాన్ యాసిడ్ బాటిల్ తీసుకురాగా, అర్మాన్ అనే మరో వ్యక్తి ఆమెపై యాసిడ్ విసిరాడు. ముఖాన్ని కాపాడుకునే ప్రయత్నంలో బాధితురాలి చేతులకు గాయాలయ్యాయి.

బాధితురాలు, నిందితుడు ఇద్దరూ ముకుంద్‌పూర్ ప్రాంతానికి చెందినవారేనని పోలీసులు తెలిపారు. కొన్ని నెలలుగా ఇషాన్ తన సోదరిని వేధిస్తున్నాడని, గత నెలలో ఆమె అతడిని నిలదీసిందని బాధితురాలి సోదరుడు మీడియాకు వెల్లడించాడు. దాడి తర్వాత నిందితులు పరారయ్యారని, వారి కోసం గాలిస్తున్నామని నార్త్‌వెస్ట్ డీసీపీ భీషమ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, స్వల్ప గాయాలయ్యాయని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే నిందితుడి భార్య చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను బాధితురాలి కుటుంబం ఖండించింది. యాసిడ్ దాడి కేసును తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బాధితురాలి బంధువు ఒకరు ఆరోపించారు. ప్రస్తుతం బాధితురాలి తండ్రి పని నిమిత్తం ఊరిలో లేరని తెలిపారు. పోలీసులు ప్రస్తుతం యాసిడ్ దాడి కేసుతో పాటు నిందితుడి భార్య చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదుపైనా దర్యాప్తు జరుపుతున్నారు.

తీవ్రంగా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ 
మరోవైపు ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని, బాధితురాలికి మెరుగైన వైద్యం, నష్టపరిహారం అందించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. మహిళలపై జరిగే యాసిడ్ దాడులను ఏమాత్రం సహించబోమని, నిందితులకు కఠిన శిక్షలు పడాలని కమిషన్ స్పష్టం చేసింది.
Delhi Acid Attack
Acid Attack
Delhi Crime
Sexual Harassment Allegation
Mukundpur
National Commission for Women
Crime News Delhi
Ishan
Arman
Acid Attack Victim

More Telugu News