Shreyas Iyer: టీమిండియాకు భారీ షాక్.. ఐసీయూలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

Shreyas Iyer Suffers Injury Internal Bleeding Admitted to ICU
  • ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్
  • పక్కటెముకల గాయంతో ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్లు నిర్ధారణ
  • సిడ్నీలోని ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న వైస్ కెప్టెన్
  • ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడి
  • కోలుకోవడానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆయనకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయినట్లు తేలింది. దీంతో ఆయన్ను సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి, ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని శ్రేయస్ వెనక్కి పరుగెడుతూ అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఈ క్రమంలో కింద పడటంతో ఆయన ఎడమ పక్కటెముకలకు గాయమైంది. మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న త‌ర్వాత‌ బీసీసీఐ వైద్య బృందం వెంటనే ఆసుపత్రికి తరలించింది.

"గత రెండు రోజులుగా శ్రేయస్ ఐసీయూలోనే ఉన్నాడు. వైద్య పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాత అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు గుర్తించి, వెంటనే ఆసుపత్రిలో చేర్పించాం. ఇన్ఫెక్షన్ వ్యాపించకుండా ఉండేందుకు రెండు నుంచి ఏడు రోజుల వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు" అని ఈ పరిణామం గురించి తెలిసిన ఓ అధికారి మీడియాకు తెలిపారు.

"టీమ్ డాక్టర్, ఫిజియో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. కానీ, ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉండేది. శ్రేయస్ మానసికంగా చాలా ధైర్యవంతుడు, త్వరలోనే కోలుకుంటాడు" అని ఆయన వివరించారు.

అంతర్గత రక్తస్రావం కావడంతో శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చని తెలుస్తోంది. కనీసం వారం రోజుల పాటు ఆయన సిడ్నీలోనే ఆసుపత్రిలో ఉండవచ్చని సమాచారం. కాగా, శ్రేయస్ ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌కు ఎంపిక కాని విషయం తెలిసిందే.
Shreyas Iyer
Shreyas Iyer injury
India vs Australia
cricket injury
internal bleeding
Sydney hospital
ICU
BCCI
Alex Carey catch

More Telugu News