Granthi Srinivas: పవన్‌ను కలవాలి.. భీమవరం గుట్టు విప్పుతా: మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్

Granthi Srinivas Wants to Meet Pawan Kalyan to Expose Bhimavaram Secrets
  • డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరిన గ్రంథి శ్రీనివాస్
  • భీమవరంలో పేకాట, అక్రమాలపై ఫిర్యాదు చేస్తానన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే
  • కూటమి నేతలే క్లబ్బుల నుంచి మామూళ్లు వసూలు చేస్తున్నారని ఆరోపణ
  • డీఎస్పీ విషయంలో రఘురామకృష్ణరాజు చెప్పింది నిజమేనన్న గ్రంథి
  • రాముడి పేరు పెట్టుకున్నంత మాత్రాన రాముడు అయిపోరంటూ పరోక్ష విమర్శలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని భీమవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అభ్యర్థించారు. భీమవరంలో జరుగుతున్న పేకాట వ్యవహారంపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వంలోని కొందరు నేతలే క్లబ్బుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారని, ఈ అక్రమాలన్నింటినీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలనుకుంటున్నానని తెలిపారు.

గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భీమవరంలో పేకాటపై సీఎం చంద్రబాబు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించడాన్ని స్వాగతిస్తున్నానని, ఆయన అవకాశం ఇస్తే నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై పూర్తి వివరాలు అందిస్తానని అన్నారు. "కూటమి ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచింది. గత 14 నెలలుగా క్లబ్బుల నుంచి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారు. రెండు నెలలుగా ఆ డబ్బులు ఆగిపోవడంతోనే డీఎస్పీపై ఫిర్యాదు చేశారు" అని గ్రంథి శ్రీనివాస్ ఆరోపించారు.

డీఎస్పీ జయసూర్య వ్యవహారంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఉన్నాయని గ్రంథి సమర్థించారు. "అసలు దొంగలెవరో తెలుసుకోవడానికి పెద్దగా విచారణ అవసరం లేదు. కూటమి నాయకులను అడిగితే చాలు. పవన్ కళ్యాణ్‌కు నిజం తెలుసుకోవడానికి ఒక్క నిమిషం కూడా పట్టదు" అని వ్యాఖ్యానించారు. ఒక ప్రజాప్రతినిధి క్లబ్బులు, మద్యం దుకాణాల నుంచి మామూళ్లు వసూలు చేయడమే కాకుండా, మంచినీటి పథకం పేరుతో 50 ఎకరాల భూమిని తన పేరు మీద రాయించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. "మితభాషిగా, సౌమ్యంగా ఉండి రాముడి పేరు పెట్టుకున్నంత మాత్రాన ఎవరూ రాముడు అయిపోరు" అంటూ పరోక్ష విమర్శలు చేశారు.

అలాగే, భీమవరం నుంచి కలెక్టరేట్ తరలింపును తాను వ్యతిరేకిస్తున్నానని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై వైసీపీ అభ్యర్థిగా గెలిచిన గ్రంథి శ్రీనివాస్, ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన జనసేనలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Granthi Srinivas
Pawan Kalyan
Bhimavaram
YCP
Deputy CM
gambling
corruption allegations
Andhra Pradesh politics
Raghurama Krishnam Raju
West Godavari district

More Telugu News