Chandrababu Naidu: ఏపీలో ఆరు కొత్త జిల్లాలు.. జిల్లాల పునర్విభజనపై రేపు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ

Chandrababu Naidu to Discuss AP New Districts Proposal
  • అమరావతి, మార్కాపురం, రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు
  • దాదాపు 200 వినతులు, ప్రతిపాదనలపై కీలక చర్చ
  • 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సిఫార్సులు
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పుపై ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. జిల్లాల పునర్విభజనకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వినతులు, ప్రతిపాదనలపై ముఖ్యమంత్రితో చర్చించి, ఆయన సూచనల మేరకు తుది నివేదికను రూపొందించనుంది. ఈ నివేదికను నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి.

పరిపాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లాల సరిహద్దులు, పేర్ల మార్పు కోసం ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నుంచి దాదాపు 200 వరకు అర్జీలు అందాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన ఉపసంఘం, జిల్లా అధికారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంది. జనగణన ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

కొత్త జిల్లాలపై కీలక సిఫార్సులు

వైసీపీ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. జిల్లాల విభజన, పెంపు జరిగిన నాటి నుంచి అనేక వివాదాలు, అసంతృప్తులు ప్రజలు, రాజకీయ పక్షాల నుంచి నాడు వెల్లువెత్తాయి. ప్రజల అభిప్రాయాలను సమగ్రంగా సేకరించకుండానే గత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గందరగోళానికి దారి తీసింది. అయితే ఈ గందరగోళానికి తెరదించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలు, రాజకీయ నేతల విజ్ఞప్తుల నేపథ్యంలో 26 జిల్లాలను 32 జిల్లాలు చేసేందుకు ప్రభుత్వం యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా ఆరు కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉపసంఘం ముఖ్యమంత్రికి నివేదించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఉపసంఘం సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో ఈ జిల్లాను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా, అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాలతో మరో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. సచివాలయం, అసెంబ్లీ ఇక్కడే ఉండటం, భవిష్యత్తులో పరిపాలనా కార్యకలాపాలు, ప్రోటోకాల్ విధులు పెరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాంతంలో రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు నాలుగు విలీన మండలాలతో రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై కూడా సీఎం వద్ద చర్చ జరగనుంది. 

రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు 187 కి.మీ. దూరంలో ఉండటంతో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది. అలానే ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాలతో పలాస కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదనలో ఉంది. ఇక గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో కలిపి గూడురు జిల్లా కేంద్రంగా కొత్త జిల్లా ప్రతిపాదనలో ఉంది. అలానే మదనపల్లి, పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాలతో మదనపల్లి కేంద్రంగా మరో కొత్త జిల్లా ఏర్పాటుకు ఉప సంఘం ప్రతిపాదించినట్లు సమాచారం.

కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటు

కొత్త జిల్లాలతో పాటు అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఒక నియోజకవర్గం రెండు, మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉండటంతో తలెత్తుతున్న పరిపాలనా ఇబ్బందులను తొలగించేందుకు ఒకే నియోజకవర్గ పరిధిలోకి తెచ్చేలా మార్పులు చేయనున్నారు. ఆదోని వంటి పెద్ద మండలాలను విభజించాలనే వినతులపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని అశాస్త్రీయ విభజనలను సరిదిద్దే అంశంపైనా దృష్టి సారించారు. కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కొనసాగించాలా లేక ప్రకాశం జిల్లాలో కలపాలా అనే అంశంపై కూడా ఈ భేటీలో స్పష్టత రానుంది. 
Chandrababu Naidu
AP districts
Andhra Pradesh districts
new districts AP
district reorganization
Markapuram district
Palasa district
Guduru district
Madanapalle district

More Telugu News