Rajani-Kamal Multistarrer: ఒకే తెరపై రజనీ-కమల్.. దశాబ్దాల కల నెరవేరుస్తున్న దిగ్గజాలు

Rajinikanth Kamal Haasan Multistarrer Confirmed by Daughters
  • ప్రాజెక్ట్‌ను ధ్రువీకరించిన సౌందర్య రజనీకాంత్, శ్రుతి హాసన్
  • రాజ్ కమల్ ఫిల్మ్స్ పతాకంపై సినిమా నిర్మాణం
  • 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వమంటూ ప్రచారం
  • ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ప్రీ-ప్రొడక్షన్ పనులు
  • దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వస్తున్న కాంబినేషన్
తమిళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అభిమానులు ఎదురుచూస్తున్న ఓ అద్భుత కలయిక సాకారం కాబోతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ కలిసి ఓ భారీ చిత్రంలో నటించనున్నారు. ఎప్పటినుంచో ఊహాగానాల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా అధికారిక స్పష్టత వచ్చింది. రజనీకాంత్ కుమార్తె సౌందర్య, కమల్ హాసన్ కుమార్తె శ్రుతి హాసన్ ఈ వార్తను ధ్రువీకరించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

చెన్నైలో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సౌందర్య, శ్రుతి ఈ ప్రాజెక్ట్‌పై స్పందించారు. కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఈ సినిమా నిర్మితం కానుందని, ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని వారు వెల్లడించారు. త్వరలోనే పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన ఉంటుందని తెలిపారు. ఇటీవల సైమా అవార్డుల వేడుకలో కమల్ హాసన్ కూడా మాట్లాడుతూ, "మేమిద్దరం కలిసి నటించాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం" అని చెప్పడం ఈ వార్తకు మరింత బలాన్నిచ్చింది.

గతంలో ఈ ప్రాజెక్ట్‌కు లోకేశ్ కనగరాజ్, ప్రదీప్ రంగనాథన్ వంటి దర్శకుల పేర్లు వినిపించినా, అవి కార్యరూపం దాల్చలేదు. తాజా సమాచారం ప్రకారం 'జైలర్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'జైలర్ 2' పూర్తి చేసిన వెంటనే నెల్సన్ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.

రజనీకాంత్, కమల్ హాసన్ గతంలో 'అపూర్వ రాగంగళ్', 'మూండ్రు ముడిచ్చు', 'అంతులేని కథ' వంటి క్లాసిక్ చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. అయితే, 1979లో వచ్చిన 'అల్లావుద్దీనుమ్‌ అద్భుత విళక్కుమ్‌' తర్వాత వారు మళ్లీ పూర్తిస్థాయిలో కలిసి నటించలేదు. దాదాపు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
Rajani-Kamal Multistarrer
Rajinikanth
Kamal Haasan
Rajinikanth Kamal movie
Tamil cinema
Nelson Dilipkumar
jailer 2
Shruti Haasan
Soundarya Rajinikanth
Kollywood
Raj Kamal Films International

More Telugu News