Jagan Mohan Reddy: మొంథా తుపాను ఎఫెక్ట్... వైసీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు వాయిదా

Jagan Mohan Reddy YSRCP Postpones Agitations Due to Montha Cyclone
  • బంగాళాఖాతంలో మొంథా తుపాను
  • అక్టోబర్ 28న జరగాల్సిన వైసీపీ ర్యాలీలు నవంబర్ 4కి మార్పు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన వైఎస్ జగన్
  • తుపాను వేళ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని కాకాణి ఆరోపణ
బంగాళాఖాతంలో ‘మొంథా’ తుపాను కారణంగా వైసీపీ తన రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ 28న తలపెట్టిన నిరసన ర్యాలీలను నవంబర్ 4వ తేదీన నిర్వహించనున్నట్లు పార్టీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ నేపథ్యంలో, తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విజ్ఞప్తి చేశారు. సహాయక, పునరావాస కార్యక్రమాల్లో స్థానిక ప్రజలకు అండగా నిలవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, వలంటీర్లకు ఆయన పిలుపునిచ్చారు.

మరోవైపు, తుపాను ముంచుకొస్తున్న వేళ రైతుల సంక్షేమం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు, కర్నూలు, ఒంగోలు జిల్లాల్లో భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా, ప్రభుత్వం నుంచి కనీస హెచ్చరికలు గానీ, నివారణ చర్యలు గానీ లేవని ఆయన విమర్శించారు.

వరి నాట్లు వేసిన తర్వాత మార్కెట్‌లో తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఆకస్మిక వర్షాలకు పంట కొట్టుకుపోతుంటే రైతులు నిస్సహాయంగా చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. "ఒక్క నెల్లూరు జిల్లాలోనే 2 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. కర్నూలు, ఒంగోలు పరిసర ప్రాంతాల్లో మరో లక్ష ఎకరాల పంట నీట మునిగింది. అసలు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా లేదా రైతులకు జరుగుతున్న నష్టం ఆయనకు తెలుసా?" అని కాకాణి ప్రశ్నించారు.

ఇప్పటికే మామిడి, పత్తి రైతులు భారీగా నష్టపోయారని, తాజా వర్షాలతో అదనంగా మరో 50,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. మొక్కజొన్న రైతులకు ఎకరాకు రూ.12,000 వరకు నష్టం వాటిల్లిందని, కృష్ణా, గోదావరి డెల్టా రైతులు తుపానుతో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇంత నష్టం జరుగుతున్నా ప్రభుత్వం నుంచి పరిహారంపై ఎలాంటి ప్రకటన లేదని మండిపడ్డారు.

"చంద్రబాబుకు రైతుల గురించి తెలియదు, వ్యవసాయం అంటే విలువ లేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వ్యవసాయంపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు" అని కాకాణి ఆరోపించారు. "జగన్ హయాంలో యూరియా కొరత అనే మాటే లేదు. కానీ నేటి టీడీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకే) ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసింది. ఇన్‌పుట్ సబ్సిడీలను విస్మరించి, వ్యవసాయ శాఖను దళారులకు అడ్డాగా మార్చేసింది" అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.
Jagan Mohan Reddy
Montha cyclone
YS Jagan
YSRCP
Andhra Pradesh
Kakani Govardhan Reddy
Cyclone alert
AP Politics
Government medical colleges privatization
Farmers welfare

More Telugu News