Cyclone Montha: 'మొంథా' తుపాను ఎఫెక్ట్... రేపు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Cyclone Montha Effect Red Alert Issued for Several Districts in AP
  • బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర వాయుగుండం
  • రేపు ఏపీలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
  • మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ హెచ్చరికలు
  • అక్టోబర్ 28న కాకినాడ వద్ద తీరం దాటనున్న మొంథా తుపాను
  • తీరం దాటే సమయంలో గంటకు 110 కి.మీ వేగంతో గాలులు
  • మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారుల సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రేపు (అక్టోబర్ 27) రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

రాష్ట్రంలోని మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాల, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, తూర్పు గోదావరి, అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. 

శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం మరింత బలపడి పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో 'మొంథా' తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. ప్రస్తుతం ఈ వాయుగుండం కాకినాడకు ఆగ్నేయంగా 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ తుపాను అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, గరిష్ఠంగా గాలి వేగం 110 కిలోమీటర్లకు చేరుకోవచ్చని అధికారులు హెచ్చరించారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Cyclone Montha
Andhra Pradesh
AP Rains
Red Alert
Orange Alert
IMD
Kakinada
Machilipatnam
Heavy Rains
Weather Forecast

More Telugu News