Chandrababu Naidu: మొంథా తుపాన్.. అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

Chandrababu Naidu Reviews Montha Cyclone Preparedness in Andhra Pradesh
  • అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
  • తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశం
  • విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం రానివ్వొద్దని సూచన
  • రోడ్లు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఆర్డర్
ఆంధ్రప్రదేశ్ పై మొంథా తుపాన్ పెను ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగంతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 28వ తేదీ ఉదయానికి వాయుగుండం తీవ్రమైన తుపానుగా మారుతుందని, ఈ సమయంలో ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సోషల్ మీడియాను వాడుకోవాలి..
మచిలీపట్నం నుంచి కాకినాడ వరకు తుపాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుందని, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచార వ్యవస్థలు సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, సోషల్ మీడియా, ఐవీఆర్ఎస్ కాల్స్, వాట్సాప్‌ల ద్వారా ప్రజలకు ముందస్తుగా హెచ్చరికలు పంపించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తుపాన్ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమాచారం వేగంగా చేరవేయాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.

రంగంలోకి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
తీర జిల్లాలలో ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించామని వెల్లడించిన ముఖ్యమంత్రి.. తుపాన్‌పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తున్నామన్నారు. రిజర్వాయర్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించి అందుకు అనుగుణంగా కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు సూచించారు.

విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగవద్దు
రాష్ట్రవ్యాప్తంగా 27,000 సెల్ టవర్లను డీజిల్ జనరేటర్లతో సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. సముద్ర తీర ప్రాంత ప్రజలను తక్షణమే సమీపంలోని తుఫాన్ రక్షణ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యా సంస్థలకు ఆయా జిల్లాల కలెక్టర్లు సెలవులు ప్రకటించాలన్నారు. రహదారులు, చెరువులు, కాలువ గట్లు కోతకు గురైతే తక్షణం మరమ్మతులు చేసేలా సిద్ధంగా ఉండాలన్నారు. చెట్లు కూలిపోయినా, కొమ్మలు విరిగిపడినా వాటిని తొలగించడానికి అవసరమైన పవర్ సా, క్రేన్‌లు, జేసీబీలు ప్రతీ సబ్‌ డివిజన్ స్థాయిలో సిద్ధం చేయాలని, డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టేలా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.

ఎమర్జెన్సీ వాహనాలు సిద్ధం
తుపాన్ రక్షణ చర్యలపై ఇప్పటివరకు 11 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వాహనాలు సిద్ధం చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 851 జేసీబీలు, అలాగే క్రేన్‌లు - పవర్ సాలు 757 అందుబాటులో ఉంచామని వెల్లడించారు. 

సముద్రంలోని పడవలను వెనక్కి పిలిపించాలి
పంటనష్టం వివరాలను స్పష్టంగా తెలుసుకునేలా వ్యవసాయ శాఖ-ఆర్టీజీ వ్యవస్థ సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇంకా సముద్రంలోనే ఉన్న 82 మెకనైజ్డ్ పడవలు, 37 మోటరైజ్డ్ పడవలను సురక్షితంగా తీరానికి రప్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈసారి మొంథా తుపాన్‌ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాలకు ఇప్పటికే ప్రత్యేక అధికారులను నియమించామని.. ప్రతీ శాఖ, ప్రతీ విభాగం సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజల ఆస్తి, ప్రాణ, మౌలిక సదుపాయాల రక్షణకు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Montha Cyclone
Andhra Pradesh
Cyclone Alert
AP Government
Heavy Rains
NDRF
SDRF
Coastal Districts
Disaster Management

More Telugu News