అడవి ఏనుగు దెబ్బకు 18 గంటలుగా నిలిచిన వాహనాలు

  • కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ప్రయాణికులకు భయానక అనుభవం
  • రోడ్డుకు అడ్డంగా చెట్టును పడేసి పక్కనే నిల్చున్న ఏనుగు
  • ముందుకు వెళ్లే దారిలేక నిలిచిపోయిన వందలాది వాహనాలు
కేరళలో ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. అటవీ మార్గంలో వెళుతున్న వాహనాలను ఓ ఏనుగు అడ్డగించింది. ఒక చెట్టును పెకిలించి రోడ్డుకు అడ్డంగా పడేసి ఆ పక్కనే నిలుచుంది. ఎంతకూ ఆ ఏనుగు అక్కడి నుంచి కదలకపోవడంతో అంతర్రాష్ట్ర రహదారిపై సుమారు 18 గంటల పాటు వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో అతిరప్పిల్లి-మలక్కప్పర రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా అలజడి సృష్టించే ‘కబాలి’ ఏనుగు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డుపైకి వచ్చింది. రోడ్డుకు అడ్డంగా ఒక చెట్టును పడేసి తినసాగింది.

వాహనదారుల సమాచారంతో అటవీశాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. అయితే, వారిపై అది దాడి చేయడంతో తృటిలో తప్పించుకున్నారు. చివరకు సోమవారం ఉదయం 7 గంటలకు ఆ ఏనుగు తనకు తానుగా అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో 18 గంటలపాటు నిరీక్షించిన వాహనాలు నెమ్మదిగా కదిలాయి. కాగా, ఈ ఏనుగు వల్ల వాహనాల్లో చిక్కుకుపోయిన వ్యక్తులు, టూరిస్టులు ఆహారం, నీరు లేక ఇబ్బందులకు గురయ్యారు.


More Telugu News