Jajula Srinivas Goud: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు బీసీ సంఘాల మద్దతు.. కేసీఆర్‌పై జాజుల ఫైర్

Jubilee Hills BC Associations Support Congress Jajula Fires on KCR
  • నవీన్‌ను 'రౌడీ షీటర్' అన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన జాజుల శ్రీనివాస్ గౌడ్
  • కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • బీఆర్ఎస్, బీజేపీలను ఉప ఎన్నికలో ఓడించాలని బీసీ సమాజానికి పిలుపు
  • బీఆర్ఎస్ నేతలే అసలైన రౌడీలు, భూ కబ్జాదారులని ఆరోపణ
  • స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం నవంబర్ 1న ప్రత్యేక ప్రార్థనలు
జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు బీసీ సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. ఉన్నత విద్యావంతుడైన బహుజన బిడ్డపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 'రౌడీ షీటర్' అని ముద్ర వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. కేసీఆర్ తన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుని, బీసీ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో పలు బీసీ సంఘాల నేతలతో కలిసి జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సామాజిక కార్యకర్త అయిన నవీన్ యాదవ్‌పై ఏ పోలీస్ స్టేషన్‌లో రౌడీ షీట్ ఉందో కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని సవాల్ విసిరారు. బీసీలంటే కేసీఆర్‌కు లెక్కలేదని, వారిని మోసగించడంలో బీఆర్ఎస్‌కు సాటిలేదని విమర్శించారు.

కేసీఆర్ పెంచి పోషించిన బీఆర్ఎస్ పార్టీ నేతలే అసలైన రౌడీలు, దోపిడీదారులు, భూ కబ్జాదారులని జాజుల ఆరోపించారు. ఓటు అనే ఆయుధంతో ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీలను రాజకీయంగా బొంద పెట్టడానికి బీసీ సమాజమంతా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీలను బీసీలంతా ఏకమై చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాకారం కావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తెలిపారు. నవంబర్ 1వ తేదీన లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన కోరారు.
Jajula Srinivas Goud
Jubilee Hills
Congress Party
Naveen Yadav
BRS Party
KCR
BC Welfare Association
Telangana BC Commission
G Niranjan
BC Reservations

More Telugu News