RBI: వెండిపైనా రుణాలు... ఆర్బీఐ కీలక నిర్ణయం!

RBI Announces Loans on Silver A Key Decision
  • దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీ రూ.1.70 లక్షల వరకు చేరిన వైనం
  • ఇకపై వెండి వస్తువులకు బ్యాంకుల్లో తాకట్టు రుణాలు ఇచ్చే సదుపాయం
  • ఆదేశాలు జారీ చేసిన ఆర్బీఐ
బంగారంపై రుణాల మాదిరిగానే ఇకపై వెండిపై కూడా రుణాలు లభించనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలు 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

ఆర్బీఐ తాజా ఆదేశాల ప్రకారం వాణిజ్య బ్యాంకులు, బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీఎస్) వెండి నగలు, ఆభరణాలు, కాయిన్స్‌ను తనఖా పెట్టుకుని రుణాలు మంజూరు చేయవచ్చు. అయితే వెండి కడ్డీలు, ఈటీఎఫ్‌లపై రుణాలు ఇవ్వరాదని స్పష్టం చేసింది.

ఒక వ్యక్తి గరిష్టంగా 10 కేజీల వరకు వెండిని తాకట్టు పెట్టి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. అలాగే 500 గ్రాముల బరువులోపు సిల్వర్‌ కాయిన్స్ తాకట్టు పెట్టుకోవడానికి అనుమతి ఉంది. రుణ పరిమాణం వెండి ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా నిర్ణయించబడుతుందని పేర్కొంది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో వెండి ధర కేజీకి రూ.1.70 లక్షల వద్ద ఉంది. కొన్ని నెలల క్రితం రూ.2 లక్షల మార్క్‌ దాటిన సంగతి తెలిసిందే.

వెండి రేటు పెరగడానికి కారణాలు

వెండిని కేవలం ఆభరణాలకే కాకుండా పారిశ్రామిక రంగాల్లోనూ విస్తృతంగా వినియోగిస్తున్నారు. సోలార్‌ ప్యానెల్స్‌, విద్యుత్‌ బ్యాటరీలు, ఎలక్ట్రానిక్స్‌, కండక్టర్లు, వైద్య రంగం, నీటి శుద్ధి, ఫోటోగ్రఫీ తదితర రంగాల్లో సిల్వర్‌ వినియోగం పెరగడంతో రేట్లు గణనీయంగా పెరిగాయి.

వెండి మార్కెట్‌ పెరుగుదల నేపథ్యంలో ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక రంగంలో కీలక మలుపుగా భావిస్తున్నారు. 
RBI
RBI silver loans
silver loans
Reserve Bank of India
silver price
silver rate
NBFC
silver coins
silver jewellery

More Telugu News