Lionel Messi: మెస్సీ అభిమానులకు నిరాశ.. కేరళలో అర్జెంటీనా మ్యాచ్ వాయిదా

Lionel Messi Fans Disappointed Argentina Match Postponed in Kerala
  • నవంబర్ 17న జరగాల్సిన మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటన
  • ఫిఫా అనుమతిలో జాప్యం వల్లే ఈ నిర్ణయమని తెలిపిన స్పాన్సర్
  • కేరళ ఏర్పాట్లు సరిగా లేవన్న అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్
  • పదేపదే ఒప్పంద ఉల్లంఘనలు జరిగాయని ఆరోపణ
  • తదుపరి ఫిఫా విండోలో మ్యాచ్ నిర్వహించే అవకాశం
భారత ఫుట్‌బాల్ అభిమానులు, ముఖ్యంగా లియోనెల్ మెస్సీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అర్జెంటీనా మ్యాచ్ వాయిదా పడింది. కేరళలోని కొచ్చి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నవంబర్ 17న జరగాల్సిన ఈ ఫ్రెండ్లీ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తదుపరి ఫిఫా అంతర్జాతీయ మ్యాచ్ విండోలో ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ మ్యాచ్ స్పాన్సర్ అయిన రిపోర్టర్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆంటో అగస్టిన్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంస్థ ఫిఫా నుంచి అనుమతి రావడంలో జాప్యం జరగడం వల్లే, అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్ఏ)తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో వివరించారు. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

అయితే, ఈ వాయిదా వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. స్పెయిన్‌కు చెందిన 'లా నేసియన్' మీడియా కథనం ప్రకారం, మ్యాచ్ ఆతిథ్యానికి కేరళ సరైన ప్రమాణాలను అందుకోలేకపోయిందని, పదేపదే ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిందని ఏఎఫ్ఏ అధికారి ఒకరు తెలిపినట్లు సమాచారం. "నవంబర్‌లో మ్యాచ్ నిర్వహించేందుకు మేము అన్ని విధాలా ప్రయత్నించాం. మా ప్రతినిధి బృందం భారత్‌కు వచ్చి స్టేడియం, హోటల్ వంటివి పరిశీలించింది. కానీ చివరికి, భారత్ అవసరమైన ప్రమాణాలను అందుకోలేకపోయింది. అందుకే ఈ ఒప్పందాన్ని పునఃసమీక్షించి కొత్త తేదీని ఖరారు చేస్తాం" అని ఏఎఫ్ఏ అధికారి చెప్పినట్లు ఆ కథనం పేర్కొంది.

ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు కేరళలో ఆడనుందని రాష్ట్ర క్రీడల మంత్రి ప్రకటించినప్పటి నుంచి ఈ మ్యాచ్‌పై గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఒక దశలో మ్యాచ్ రద్దయిందని మంత్రి స్వయంగా ప్రకటించగా, ఆ తర్వాత ఆగస్టులో ఏఎఫ్ఏ మాత్రం తమ జట్టు కొచ్చిలో ఆడుతుందని ధ్రువీకరించింది. తాజాగా అర్జెంటీనా మీడియా నివేదికల ప్రకారం, ఈ మ్యాచ్ ఏకంగా 2026 మార్చికి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
Lionel Messi
Argentina match
Kerala
FIFA
football
Jawaharlal Nehru Stadium
AFA
football fans
international match

More Telugu News