Kavitha: నేటి నుంచే కవిత 'జనం బాట'.. నాలుగు నెలల సుదీర్ఘ యాత్ర.. కేసీఆర్ ఫొటో లేకుండానే ప్రజలలోకి!

Kalvakuntla Kavitha Launches Janam Bata Yatra Without KCR Photo
  • నిజామాబాద్ జిల్లా నుంచి నాలుగు నెలల పాటు పర్యటన
  • కేసీఆర్ ఫొటో లేకుండా, జయశంకర్ ఫొటోతో ప్రజల్లోకి
  • సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో పర్యటనకు రూపకల్పన
జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక అడుగు వేశారు. ‘జనం బాట’ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా సుదీర్ఘ యాత్రకు శ్రీకారం చుట్టారు. తన మెట్టినిల్లు నిజామాబాద్‌ నుంచే ఈ యాత్రను ప్రారంభించడం విశేషం. నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు, దాదాపు నాలుగు నెలల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ముఖ్యంగా, తండ్రి కేసీఆర్ ఫొటో లేకుండా, ప్రొఫెసర్ జయశంకర్ ఫొటోతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం ఆమె నిజామాబాద్ బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటకు ఇందల్వాయి టోల్ గేట్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి బర్దిపూర్ మీదుగా జాగృతి కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత, నవీపేట మండలం యంచలో ముంపు బాధితులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. రాత్రికి నందిపేట మండలం సీహెచ్ కొండూరులోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.

‘సామాజిక తెలంగాణ’ సాధనే లక్ష్యంగా 33 జిల్లాలను కవర్ చేసేలా కవిత తన యాత్రకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా మేధావులు, విద్యావంతులు, వివిధ వర్గాల ప్రజలతో సమావేశమై రాష్ట్ర భవిష్యత్తు, తన రాజకీయ కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రజల ఆకాంక్షలు తెలుసుకుని, వారి అభీష్టం మేరకు నడుచుకుంటానని ఆమె చెబుతున్నారు.

ఈ యాత్ర ద్వారా తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై కవిత ఓ స్పష్టతకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రజలు కోరుకుంటే కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ఆమె ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 13న యాత్ర ముగిసే నాటికి ఆమె కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Kavitha
Kalvakuntla Kavitha
Janam Bata
Nizamabad
Telangana Politics
KCR
Professor Jayashankar
BRS
Political Tour

More Telugu News