ఆ చేతబడికి కేరళ వెళ్లి విరుగుడు చేయించుకున్నా: సుమన్

  • కర్మ ఎవరైనా అనుభవించాల్సిందేనన్న సుమన్ 
  • తనపై చేతబడి జరిగిందనేది నిజమన్న సుమన్
  • జీవితంలో అన్నీకర్మ ప్రకారమే జరుగుతాయన్న వ్యాఖ్య
ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోగా వెలుగొందిన నటుడు సుమన్‌ తనపై జరిగిన చేతబడి ఘటనను తాజాగా బహిర్గతం చేశారు. ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్న ఆయన ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరిగిన చేతబడి గురించి వివరించారు.

తన కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలో ఎవరో చేతబడి చేశారని, ఆ ప్రభావం వల్ల వరుసగా ఎదురుదెబ్బలు తగలడం ప్రారంభమైందని సుమన్‌ తెలిపారు. "నాపై చేతబడి జరిగింది అన్నది నిజమే. కానీ ఎవరు చేయించారో నాకు తెలియదు. సినిమా ఇండస్ట్రీలోనే కాదు, బిజినెస్‌ రంగంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి" అని ఆయన చెప్పారు.

అప్పట్లో కొంతమంది సలహా మేరకు కేరళలోని ‘చోటనికరే’ అనే ప్రాంతానికి వెళ్లి విరుగుడు పూజ చేయించుకున్నానని వెల్లడించారు. “అది సరిగా పనిచేసిందా, కాదా నాకు తెలియదు. కానీ నేను టైమ్‌ని బాగా నమ్ముతాను. ఏది జరగాలో ఆ టైమ్‌ జరిపిస్తుంది. అదే కర్మ” అని సుమన్‌ వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు.

రోగాలు, ఎదురుదెబ్బలు, విజయాలు అన్నీ మన కర్మ ప్రకారం జరుగుతాయని, వాటిని తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదని, టైమ్‌ మన జీవితంలో కీలకమని అన్నారు. తాను అనుభవపూర్వకంగా చెబుతున్నానని పేర్కొన్నారు. మనం చెప్పుకోవడానికి చాలా చెప్పొచ్చు, వాడు తొక్కేశాడు, వీడు నొక్కేశాడు, ఎక్కేశాడు, వీడి వల్ల అలా జరిగింది, ఇలా జరిగిందని అంటారని, కానీ ఆ టైమ్ అలా జరిపిస్తుందన్నారు. ఆ టైమ్ కొందరితో అలా చేయిస్తుంది. నిజానికి వాళ్లకు అలా చేయాలనే ఉద్దేశం ఉండదు కానీ టైమ్ వాళ్లని అలా చేయిస్తుంది, అది కూడా వాళ్ల రాతే, దాన్నే కర్మ అని అంటారని చెప్పుకొచ్చారు.

గతంలో సుమన్ అనుకోకుండా ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలుకు వెళ్లడం, ఆరు నెలల పాటు జైలులో ఉండటంతో ఆయన కెరీర్‌ దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే, సుమన్‌ ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. చేతబడి, కర్మ, టైమ్‌ గురించి ఆయన తాత్విక ధోరణిలో మాట్లాడటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 


More Telugu News