Vindhya Visakha: కోహ్లీ అభిమానికి సాయం చేసిన తెలుగు యాంకర్

Vindhya Visakha Helps Young Kohli Fan
  • కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించిన వింద్య విశాఖ
  • బాలుడికి సాయం అందించాలంటూ ఇన్‌స్టాలో పోస్టు
  • వింద్య మానవతా చర్యను అభినందిస్తున్న నెటిజన్లు  
ప్రముఖ క్రీడా వ్యాఖ్యాత, తెలుగు యాంకర్ వింధ్య విశాఖ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. జన్యుపరమైన కారణాల వల్ల కిడ్నీ, కాలేయ వైఫల్యంతో బాధపడుతున్న చిన్నారి ప్రణీత్‌కు ఆర్థిక సహాయం అందించి అందరి దృష్టిని ఆకర్షించారు.

వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని గిరిపల్లి గ్రామానికి చెందిన ప్రణీత్ (9) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వారానికి మూడు రోజులు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. అదే ఆసుపత్రిలో తన తండ్రి డయాలసిస్ కోసం తరచూ వెళ్తున్న వింధ్య విశాఖ, పక్క బెడ్‌పై ఉన్న ఈ బాలుడి పరిస్థితిని గమనించి చలించిపోయారు. బాలుడి కుటుంబ వివరాలు తెలుసుకున్న ఆమె రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు.

ప్రణీత్‌కు ధైర్యం చెబుతూ.. “నీ ఆరోగ్యం కచ్చితంగా బాగుపడుతుంది, నువ్వు తప్పక విజయం సాధిస్తావు,” అని వింధ్య ప్రోత్సహించారు. క్రికెట్ అభిమాని అయిన ప్రణీత్ తన అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ అని, అతని జెర్సీ నెంబర్ 18 అని తెలిపాడు.

ఈ బాలుడి కిడ్నీ, కాలేయ మార్పిడి చికిత్సకు అందరూ సాయం చేయాలంటూ తన సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో వింధ్య ఓ వీడియోను షేర్ చేశారు. బాలుడి చికిత్స కోసం ఇప్పటి వరకు రూ.20 లక్షలు ఖర్చు చేశామని, కిడ్నీ, కాలేయ మార్పిడి కోసం ప్రభుత్వం జీవన్దాన్ పథకం కింద అనుమతి ఇచ్చిందని, అయితే ఆ ఆపరేషన్ ఖర్చు రూ.40 లక్షలు అవుతుందని వైద్యులు తెలిపారని, అంత మొత్తం తమ వద్ద లేదని, తమను ఆదుకోవాలని ప్రణీత్ తల్లిదండ్రులు కోరుతున్నారు.

సాయం చేయాలనుకునే వారు ప్రణీత్ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ 9849520535కు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా సహాయం అందించాలని వింధ్య విశాఖ విజ్ఞప్తి చేశారు. వింధ్య విశాఖ చేసిన ఈ మానవతా చర్యను అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 
Vindhya Visakha
Telugu anchor
sports presenter
Praneeth
kidney failure
liver failure
Virat Kohli fan
charity
social media
kidney transplant

More Telugu News