Bharat Taxi: ఓలా, ఉబర్‌కు చెక్.. వచ్చేస్తోంది 'భారత్ ట్యాక్సీ'

Bharat Taxi to compete with Ola Uber in India
  • ఓలా, ఉబర్‌లకు పోటీగా 'భారత్ ట్యాక్సీ'
  • సహకార పద్ధతిలో పనిచేయనున్న కొత్త సర్వీస్
  • డ్రైవర్ల నుంచి ఎలాంటి కమీషన్లు వసూలు చేయరు
  • నవంబర్‌లో ఢిల్లీలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభం
  • వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా విస్తరణ
  • కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో రూపకల్పన
దేశంలో క్యాబ్ సేవల రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'భారత్ ట్యాక్సీ' పేరుతో సహకార పద్ధతిలో ఓ సరికొత్త రైడ్-హెయిలింగ్ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. డ్రైవర్ల నుంచి ఎలాంటి కమీషన్లు వసూలు చేయకుండా, కేవలం సభ్యత్వ రుసుముతోనే ఈ సేవలు అందించనుండటం దీని ప్రత్యేకత.

ప్రస్తుతం ఓలా, ఉబర్ సంస్థలు డ్రైవర్ల నుంచి ప్రతీ రైడ్‌పై 25 శాతం వరకు అధిక కమీషన్లు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, రద్దీ సమయాలు, ట్రిప్ రద్దుల పేరుతో ప్రయాణికులపై కూడా అధిక చార్జీల భారం మోపుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా, డ్రైవర్లు, ప్రయాణికులు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కేంద్రం ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.

కేంద్ర సహకార శాఖ, జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (NeGD) కలిసి 'భారత్ ట్యాక్సీ'ని రూపొందించాయి. దీని కోసం రూ.300 కోట్ల మూలధనంతో 'సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్' అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ విధానంలో డ్రైవర్లు కమీషన్లకు బదులుగా రోజువారీ లేదా నెలవారీ సభ్యత్వ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల ప్రయాణ చార్జీలు పూర్తిగా వారికే దక్కుతాయి.

ఈ సేవలను తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా నవంబర్ నుంచి ఢిల్లీలో 650 క్యాబ్‌లతో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్‌లో ముంబై, పుణె, భోపాల్, జైపూర్ వంటి 20 నగరాలకు విస్తరిస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో 'భారత్ ట్యాక్సీ'ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మంది క్యాబ్ డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Bharat Taxi
Ola
Uber
Cab services
Ride-hailing service
National e-Governance Division
Cooperative society
Taxi drivers
Commission free
Sahakar Taxi Cooperative Limited

More Telugu News