Pakistan Hockey: భారత్ లో జూనియర్ హాకీ ప్రపంచ కప్... తప్పుకున్న పాకిస్థాన్

Pakistan Hockey Withdraws from Junior Hockey World Cup in Chennai Madurai
  • నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28 వరకు జూనియర్ హాకీ ప్రపంచ కప్
  • పాక్ తప్పుకున్నట్లు ప్రకటించిన అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్
  • పాక్ స్థానంలో మరో జట్టును ప్రకటించనున్నట్లు హాకీ ఫెడరేషన్ వెల్లడి
భారత్ లో నవంబర్-డిసెంబర్ నెలల్లో జరగనున్న జూనియర్ హాకీ ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ వైదొలిగినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య శుక్రవారం ప్రకటించింది. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు చెన్నై, మధురైలలో జూనియర్ హాకీ ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. పాకిస్థాన్ తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో మరో జట్టును ప్రకటిస్తామని హాకీ సమాఖ్య తెలిపింది.

టోర్నీలోని గ్రూప్ 'బీ'లో భారత్, చిలీ, స్విట్జర్లాండ్, పాకిస్థాన్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్థాన్ తప్పుకోవడంతో ఏ జట్టును భర్తీ చేస్తారో వేచి చూడాలి. కాగా, ఈ టోర్నీలో తాము ఆడేందుకు వీలుగా తటస్థ వేదిక ఏర్పాటు చేయాలని పాక్ డిమాండ్ చేస్తోంది.

భార‌త్‌లో జ‌రుగుతున్న టోర్నీల నుంచి పాకిస్థాన్ వైదొలగడం ఇదే రెండోసారి. ఇటీవ‌ల ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు రాజ్‌గిర్‌లో జరిగిన పురుషుల ఆసియా క‌ప్ హాకీ నుంచి కూడా పాకిస్థాన్ జట్టు తప్పుకుంది.

పహల్గామ్ ఉగ్ర‌దాడి త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య క్రీడా సంబంధాలు బలహీనపడిన విష‌యం తెలిసిందే. జూనియ‌ర్ హాకీ ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ త‌ప్పుకున్న విష‌యంపై తమకు స‌మాచారం లేద‌ని హాకీ ఇండియా తెలిపింది.

ఇటీవల భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక క్రీడల్లో పాల్గొనదని స్పష్టం చేసింది. కానీ అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో పోటీ పడుతుందని తెలిపింది. ఇటీవల క్రికెట్ ఆసియా కప్ సందర్భంగా భారత జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్ తన పాకిస్థాన్ ప్రత్యర్థితో కరచాలనం చేయడానికి నిరాకరించాడు.

పాకిస్థాన్ వైదొలిగినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలాంత్ సింగ్ తెలిపారు. నెలన్నర క్రితం తాను పాక్ హాకీ సమాఖ్య అధికారులతో మాట్లాడానని, వారు ఆడుతామని చెప్పారని తెలియజేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియదని అన్నారు. ఆతిథ్య జట్టుగా ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహించడం తమ బాధ్యత అని, భారత్ టైటిల్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ స్థానంలో ఎవరిని ప్రకటించాలనేది అంతర్జాతీయ హాకీ సమాఖ్య నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Pakistan Hockey
Junior Hockey World Cup
Chennai
Madhurai
Hockey India
Bhola Nath Singh

More Telugu News