నమ్మలేకపోతున్నాను... అబుదాబిలో హిందూ ఆలయాన్ని చూసి ముగ్ధుడైన సీఎం చంద్రబాబు

  • యూఏఈ పర్యటనలో అబుదాబి బీఏపీఎస్ ఆలయాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు
  • తన జీవితంలో ఇదొక అద్భుతమైన అనుభవమని వ్యాఖ్య
  • ఆలయ శిల్పకళను చూసి 'నిజమైన అద్భుతం' అని ప్రశంస
  • చరిత్రలో నిలిచిపోయే అద్భుతమని ఆలయ నిర్మాణంపై కితాబు
  • ఆలయ నిర్మాణానికి యూఏఈ నాయకత్వం సహకారాన్ని కొనియాడిన సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుతం యూఏఈలో మూడు రోజుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన అబుదాబిలోని బోచాసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) హిందూ మందిరాన్ని సందర్శించారు. ఆలయ సందర్శన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది తన జీవితంలో అత్యంత అద్భుతమైన అనుభవాలలో ఒకటి అని అభివర్ణించారు.

ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బ్రహ్మవిహారిదాస్ స్వామి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయ విశిష్టతలను, అద్భుతమైన శిల్పకళను, ఆధునిక ఆవిష్కరణలను, ఐక్యత సందేశాన్ని ఆయనకు వివరించారు. ఆలయంలోని సుందరమైన, సున్నితమైన కళానైపుణ్యాన్ని చూసి ముగ్ధుడైన చంద్రబాబు, దీనిని "ఒక నిజమైన అద్భుతం" అని కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గతంలో తిరుపతిలోని శ్రీనివాస-పద్మావతి సన్నిధి వద్ద విగ్రహ నిర్మాణం పర్యవేక్షించిన ఒక దక్షిణాది వలంటీర్‌ను అబుదాబి ఆలయంలో కలిసి ఆయన సేవలను అభినందించారు.

ఆలయ ప్రాంగణమంతా కలియదిరిగిన చంద్రబాబు, దాని నిర్మాణ శైలి, వైభవాన్ని చూసి ఎంతగానో ప్రశంసించారు. ఆలయాన్ని పూర్తిస్థాయిలో చూడటం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు. యువతకు ఇలాంటి నిర్మాణాలు ఎంతో అవసరమని పేర్కొంటూ, "మన సంస్కృతీ విలువలను యువతకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఈ ఆలయం ఆ పని చేస్తోంది" అని ఆయన అన్నారు. చారిత్రకమైన ఈ సాంస్కృతిక సౌధం నిర్మాణానికి యూఏఈ నాయకత్వం అందించిన బలమైన మద్దతును కూడా ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా, దక్షిణాదికి చెందిన ఒక భక్తుడు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ, "నేను వందకు పైగా సార్లు ఇక్కడికి వచ్చాను. ఇది కేవలం ప్రార్థనా స్థలం కాదు, ఇది నా ఇల్లు. మన మూలాలు, సంస్కృతి ఇక్కడ సజీవంగా ఉన్నాయనడానికి ఇదొక గుర్తు" అని తన ఆనందాన్ని పంచుకున్నారు.

ఆలయ సౌందర్యాన్ని చూసి అబ్బురపడిన చంద్రబాబు, "నా జీవితంలో ఎన్నో విజయగాథలు చూశాను. కానీ ఇది ఒక ప్రత్యేకమైన విజయం. కేవలం ఐదేళ్లలో మీరు చరిత్రలో నిలిచిపోయే, ఒక వారసత్వంగా మిగిలిపోయే అద్భుతాన్ని సాధించారు. ఇక్కడ నేను చూసింది నిజంగా నమ్మశక్యంగా లేదు" అని తన ముగింపు వ్యాఖ్యలలో పేర్కొన్నారు.


More Telugu News