ISRO: అమెరికాకు చెందిన 6.5 టన్నుల బ్లూబర్డ్ శాటిలైట్ ను ప్రయోగించనున్న ఇస్రో

ISRO to Launch US Bluebird 6 Satellite
  • ఈ ఏడాది చివరికల్లా అమెరికా బ్లూబర్డ్-6 ఉపగ్రహ ప్రయోగం
  • ఇస్రోకు చెందిన అత్యంత శక్తిమంతమైన LVM-3 రాకెట్‌తో నింగిలోకి
  • బ్లూబర్డ్... 6.5 టన్నుల బరువుతో అతిపెద్ద వాణిజ్య శాటిలైట్లలో ఒకటి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది. అమెరికాతో అంతరిక్ష సహకారంలో భాగంగా, ఆ దేశానికి చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన 'బ్లూబర్డ్-6' అనే భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. భారతదేశపు అత్యంత శక్తిమంతమైన LVM-3 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనుండటం విశేషం.

ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ గురువారం వెల్లడించారు. "బ్లూబర్డ్-6 ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇప్పటికే ఆ శాటిలైట్‌ అమెరికా నుంచి మా వద్దకు చేరింది. రాకెట్ అనుసంధాన పనులు వేగంగా జరుగుతున్నాయి" అని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరిలోగా ప్రయోగాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ప్రయోగ తేదీని సరైన సమయంలో ప్రధానమంత్రి ప్రకటిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే నాసా-ఇస్రో సంయుక్తంగా చేపట్టిన నిసార్ (NISAR) మిషన్ విజయవంతమైన నేపథ్యంలో, ఈ తాజా ప్రయోగం ఇరు దేశాల మధ్య అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.

బ్లూబర్డ్-6 ఉపగ్రహం బరువు 6.5 టన్నులు. ఇది ఇస్రో ప్రయోగించనున్న అత్యంత బరువైన వాణిజ్య ఉపగ్రహాల్లో ఒకటి. అమెరికా నుంచి ఈ ఉపగ్రహం అక్టోబర్ 19న భారతదేశానికి చేరుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 రాకెట్ ద్వారా దీనిని భూ నిమ్న కక్ష్య (LEO)లోకి ప్రవేశపెట్టనున్నారు.

ఈ సందర్భంగా ఇస్రో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల గురించి కూడా నారాయణన్ మాట్లాడారు. దేశపు మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర 'గగన్‌యాన్' మిషన్‌కు సంబంధించి దాదాపు 85 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. "ప్రస్తుతం సమీకృత పరీక్షలు, సాఫ్ట్‌వేర్ వాలిడేషన్ నిర్వహిస్తున్నాం. వ్యోమగాములను పంపే ముందు, పూర్తి భద్రత, వ్యవస్థ విశ్వసనీయతను నిర్ధారించుకోవడానికి మూడు మానవ రహిత ప్రయోగాలను నిర్వహిస్తాం" అని వివరించారు.

ఇదే కార్యక్రమంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) డైరెక్టర్ డాక్టర్ ఎ. రాజరాజన్ మాట్లాడుతూ, 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయుడిని పంపాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రత్యేక లాంచ్ వెహికల్ అవసరమని నొక్కిచెప్పారు. " ఇందుకోసం లూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్ (LMLV) రూపకల్పన ప్రాథమిక దశలో ఉంది. దీనికి 75,000 కిలోల పేలోడ్‌ను లో ఎర్త్ ఆర్బిట్‌కు మోసుకెళ్లే సామర్థ్యం అవసరం" అని ఆయన తెలిపారు.

నవంబర్ 3 నుంచి 5 వరకు ఢిల్లీలో జరగనున్న 'ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ (ESTIC 2025)' మీడియా సమావేశంలో భాగంగా ఇస్రో అధికారులు ఈ వివరాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
ISRO
Bluebird 6
LVM 3
AST SpaceMobile
V Narayanan
Gaganyaan
NISAR
Sriharikota
Satellite launch
India space program

More Telugu News