ఆన్‌లైన్‌లో రూ. 4 కోట్ల వాచ్ ఆర్డరిస్తే.. చేతికొచ్చింది రూ. 400 వాచ్!

  • చెన్నైలో వెలుగులోకి వచ్చిన భారీ ఆన్‌లైన్ మోసం
  • రూ.4 కోట్ల వాచ్‌ కోసం ఓ యువకుడు రూ.2.3 కోట్ల చెల్లింపు
  • డెలివరీలో రూ.400 విలువైన వాచ్ రావడంతో షాక్
  • బాధితుడు చెన్నైలోని ఓ ప్రముఖ వస్త్ర వ్యాపారి కుమారుడు
  • కొట్టూరుపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
ఆన్‌లైన్ షాపింగ్‌లో జరిగిన ఓ భారీ మోసం చెన్నై నగరంలో కలకలం రేపింది. ఏకంగా రూ.4 కోట్ల విలువైన లగ్జరీ చేతి గడియారం కోసం ఆర్డర్ ఇస్తే, తీరా డెలివరీలో కేవలం రూ.400 విలువ చేసే వాచ్ రావడంతో బాధితుడు కంగుతిన్నాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

చెన్నైకి చెందిన ఓ ప్రముఖ వస్త్రదుకాణం యజమాని కుమారుడు ఇటీవల ఓ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో రూ.4 కోట్ల విలువైన చేతి గడియారాన్ని చూశాడు. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆసక్తి చూపాడు. వెంటనే స్థానిక బోట్‌క్లబ్ ప్రాంతానికి చెందిన ఓ ఏజెంట్‌ను సంప్రదించి, ఆ వాచ్ కొనుగోలు ప్రక్రియను ప్రారంభించాడు. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం, ఆ వాచ్ కోసం ముందుగానే ఆన్‌లైన్‌లో రూ.2.3 కోట్లు చెల్లించాడు.

మంగళవారం అతడికి ఆ వాచ్ పార్శిల్ అందింది. ఎంతో ఆత్రుతతో పార్శిల్ విప్పి చూడగా, అందులో కేవలం రూ.400 విలువైన చౌకబారు వాచ్ ఉండటాన్ని చూసి నివ్వెరపోయాడు. తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు, వెంటనే కొట్టూరుపురం పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ భారీ మోసంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News