Saudi Arabia: భారత కార్మికులకు భారీ ఊరట.. కఫాలా విధానాన్ని రద్దు చేసిన సౌదీ అరేబియా

Saudi Arabia Abolishes Kafala System Impacting Indian Workers
  • లక్షలాది విదేశీ కార్మికులకు లభించనున్న స్వేచ్ఛ
  • సుమారు 25 లక్షల మంది భారతీయులకు భారీ ఊరట
  • 'విజన్ 2030'లో భాగంగా యువరాజు సంచలన సంస్కరణ
  • కార్మికుల పాస్‌పోర్టులు లాక్కోవడం, వేధించడంపై ఉక్కుపాదం
  • ఇకపై ఉద్యోగం మారేందుకు, దేశం విడిచి వెళ్లేందుకు కార్మికులకు స్వేచ్ఛ
సౌదీ అరేబియాలో దశాబ్దాలుగా విదేశీ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కఫాలా కార్మిక స్పాన్సర్‌షిప్ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఐదు దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన ఈ అమానవీయ వ్యవస్థకు ముగింపు పలుకుతూ తీసుకున్న ఈ నిర్ణయంతో కోటి ముప్పై లక్షల మంది విదేశీ కార్మికులకు విముక్తి లభించనుంది. వీరిలో సుమారు 25 లక్షల మంది భారతీయులు ఉండటం గమనార్హం. ఈ మేరకు బుధవారం నివేదికలు ధ్రువీకరించాయి.

ఏమిటీ కఫాలా వ్యవస్థ?
1950వ దశకంలో సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి భారత్, ఇతర ఆగ్నేయాసియా దేశాల నుంచి కార్మికులను రప్పించేందుకు కఫాలా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ప్రకారం, ప్రతి విదేశీ కార్మికుడికి ఒక 'కఫీల్' లేదా 'స్పాన్సర్' ఉంటారు. వీరు ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక కంపెనీ కావచ్చు. కార్మికుడి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవడం, వారి జీతాలను నిలిపివేయడం, వారు ఎప్పుడు ఉద్యోగం మారాలి, ఎప్పుడు దేశం విడిచి వెళ్లాలో నిర్ణయించడం వంటి అమానవీయ అధికారాలు ఈ స్పాన్సర్లకు ఉండేవి. కనీసం తమపై జరుగుతున్న వేధింపుల గురించి ఫిర్యాదు చేయాలన్నా స్పాన్సర్ అనుమతి తీసుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఉండేది. ఈ విధానం కార్మికుల హక్కులను కాలరాయడమే కాకుండా, వారిని వెట్టిచాకిరీలోకి నెడుతోందని కార్మిక, మానవ హక్కుల సంఘాలు ఏళ్లుగా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

'విజన్ 2030'లో భాగంగానే ఈ సంస్కరణ
సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'విజన్ 2030' ప్రణాళికలో భాగంగానే ఈ కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. దేశ ప్రతిష్ఠను పెంచడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ఆర్థిక వ్యవస్థను వైవిధ్యభరితం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా 2029లో జరగనున్న ఆసియా వింటర్ గేమ్స్ వంటి అంతర్జాతీయ కార్యక్రమాలకు ముందు దేశంలో కార్మిక సంస్కరణలు తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

గతంలో అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) సైతం కఫాలా వంటి స్పాన్సర్‌షిప్ విధానాలు కార్మికుల హక్కులను హరిస్తాయని, బలవంతపు వెట్టిచాకిరీకి దారితీస్తాయని పేర్కొంది. సౌదీ అరేబియా తాజా నిర్ణయంతో కార్మికులు స్వేచ్ఛగా ఉద్యోగాలు మారేందుకు, అవసరమైతే దేశం విడిచి వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది.
Saudi Arabia
Kafala system
Saudi labor reforms
Indian workers
Vision 2030
Migrant workers rights
Foreign workers
Mohammad Bin Salman
Asia Winter Games 2029
ILO

More Telugu News