Yogi Adityanath: దేశానికి పొలిటికల్ ఇస్లాం పెను ప్రమాదం: యోగి ఆదిత్యనాత్

Yogi Adityanath warns of Political Islam danger to India
  • శివాజీ, గురుగోవింద్ సింగ్, మహారాణి ప్రతాప్ పొలిటికల్ ఇస్లాంపై పోరాడారన్న యోగి
  • పొలిటికల్ ఇస్లాం ద్వారా దేశాన్ని విడగొట్టే శక్తులను ఉపయోగించుకుంటున్నారని వ్యాఖ్య
  • యూపీలో హలాల్ సర్టిఫికెట్‌ను జారీ చేశామని వెల్లడి
భారతదేశానికి పొలిటికల్ ఇస్లాం పెను ప్రమాదమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ఈ ముప్పుతో మన పూర్వీకులు పోరాడారని, అయితే దాని గురించి అంతగా చర్చ జరగలేదని ఆయన అన్నారు. చరిత్రలో బ్రిటిష్, ఫ్రెంచ్ వలసదారుల ప్రస్తావన ఉన్నప్పటికీ, పొలిటికల్ ఇస్లాంపై ప్రస్తావన చాలా తక్కువగా వచ్చిందని అన్నారు.

గోరఖ్‌పూర్‌లో జరుగుతున్న ఆరెస్సెస్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఛత్రపతి శివాజీ, గురుగోవింద్ సింగ్, మహారాణా ప్రతాప్, మహారాణా సంగా వంటి వీరులు పొలిటికల్ ఇస్లాంపై పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ చరిత్రను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. పొలిటికల్ ఇస్లాం ద్వారా దేశాన్ని విడగొట్టేందుకు చాంగూర్ బాబా వంటి శక్తులను ఉపయోగించుకుంటారని, అలాంటి శక్తుల నుంచి రక్షించేందుకు సమాజాన్ని ఏకం చేసే కృషిని ఆరెస్సెస్ కొనసాగిస్తోందని అన్నారు.

మతమార్పిడులకు సిద్ధపడేవారికి కులం ఆధారంగా చాంగూర్ బాబా డబ్బులు ఆఫర్ చేసేవారిని ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదని అన్నారు. ఎక్కడో విదేశాల నుంచి రావడం లేదని, మీ నుంచే వస్తున్నాయని ప్రజలను ఉద్దేశించి అన్నారు. మీరు ఏదైనా వస్తువులు కొన్నప్పుడు దానిపై హలాల్ సర్టిఫికెట్ ఉందో లేదో చూసుకోవాలని అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో హలాల్ సర్టిఫికెట్‌ను జారీ చేశామని అన్నారు. ఆశ్చర్యకరమేమంటే హలాల్ సర్టిఫికెట్ ఉన్న వస్తువుల్లో సబ్బులు, దుస్తులు, అగ్గిపెట్టెలు ఉన్నాయని అన్నారు.

కేంద్రం నుంచి లేదా రాష్ట్రం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే హలాల్ సర్టిఫికేషన్ పేరుతో రూ. 25,000 కోట్లు పోగు చేశారని ఆరోపించారు. ఈ డబ్బును ఉగ్రవాదం, లవ్ జిహాద్, మతమార్పిడులకు ఖర్చు చేస్తుంటారని యోగి ఆరోపించారు. ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎవరు తయారు చేశారో చూసుకోవాలని అన్నారు.
Yogi Adityanath
Political Islam
RSS
Uttar Pradesh
Halal certification
Religious conversion
terrorism

More Telugu News