AP Prawns: ఏపీ రొయ్యల రైతులకు గుడ్ న్యూస్.. ఎనిమిదేళ్ల తర్వాత ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్

Australia Lifts Ban on Indian Shrimp Imports Following Nara Lokesh Visit
  • భారత రొయ్యల దిగుమతికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆస్ట్రేలియా
  • ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిషేధం తర్వాత కీలక పరిణామం
  • అమెరికా సుంకాలతో నష్టపోయిన ఏపీ రైతులకు భారీ ఊరట
  • వ్యాధి రహిత జోన్ల నుంచి దిగుమతికి షరతులతో అనుమతి
  • మంత్రి లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటనలో అధికారిక వెల్లడి
  • లోకేశ్‌ కృషితోనే ఆక్వా రైతులకు ఆస్ట్రేలియా మార్కెట్ లో  ఊరట అన్న మంతెన సత్యనారాయణ రాజు
అమెరికా విధించిన భారీ సుంకాలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ రొయ్యల పరిశ్రమకు భారీ ఊరట లభించింది. దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, భారత రొయ్యల దిగుమతికి ఆస్ట్రేలియా షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఈ పరిణామం దేశీయ రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం వాటా కలిగిన ఏపీ రైతులకు కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఏడు రోజుల పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ శుభవార్తను స్వయంగా ప్రకటించారు. "భారత సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులకు ఎప్పటినుంచో అడ్డంకిగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించింది. వైట్ స్పాట్ వైరస్ కారణంగా ఆస్ట్రేలియా విధించిన పరిమితులు తొలగిపోయాయి. భారత రొయ్యలకు తొలి దిగుమతి అనుమతి లభించింది. ఇది ఈ రంగంలో ఒక పెద్ద ముందడుగు" అని లోకేశ్ 'ఎక్స్‌' (ట్విట్ట‌ర్‌) వేదికగా తెలిపారు.

2017 జనవరిలో కొన్ని రొయ్యల సరుకుల్లో 'వైట్ స్పాట్ వైరస్' గుర్తించడంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి పొట్టు తీయని రొయ్యల దిగుమతులపై నిషేధం విధించింది. అప్పటి నుంచి భారత ఎగుమతిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు, ఇటీవల ట్రంప్ హయాంలో అమెరికా ప్రభుత్వం భారత రొయ్యలపై 59.72 శాతం వరకు సుంకాలు విధించడంతో ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఏపీ నుంచి 70 శాతం రొయ్యలు అమెరికాకే ఎగుమతి అయ్యేవి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మార్కెట్ తిరిగి తెరచుకోవడం కీలకంగా మారింది.

మొన్న రష్యా, నేడు ఆస్ట్రేలియా మార్కెట్‌లో ప్రవేశం సాధించడం రాష్ట్ర ఆక్వా రంగానికి మైలురాయిగా నిలిచింది:  మంతెన సత్యనారాయణ రాజు
మొన్న రష్యా, నేడు ఆస్ట్రేలియా మార్కెట్‌లో ప్రవేశం సాధించడం రాష్ట్ర ఆక్వా రంగానికి మైలురాయిగా నిలిచిందని  మాజీ శాసనమండలి సభ్యులు, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ఆయ‌న మాట్లాడుతూ... రొయ్యలు సాగు చేసిన రైతు మీసం తిప్పేలా చేసిన యువనేత నారా లోకేశ్‌. ఒకవైపు యువత, మరోవైపు రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్న విషయం మంత్రి నారా లోకేశ్‌ ఆస్ట్రేలియా పర్యటన ద్వారా మరోసారి స్పష్టమైంది. ఆక్వా రైతులు ఎగుమతులు లేక నష్టపోతున్న సమస్యను అధిగమించేందుకు ఆయన చేసిన కృషి అభినందనీయం. ఆక్వా రైతుల పట్ల మంత్రి లోకేశ్‌ నిబద్ధత, దూరదృష్టి వల్లే ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు అంతర్జాతీయ మార్కెట్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఆస్ట్రేలియా మార్కెట్‌లో ప్రవేశం సాధించడం రాష్ట్ర ఆక్వా రంగానికి మైలురాయిగా నిలిచింది. అమెరికా భారీ సుంకాలు, అనేక  అడ్డంకుల మధ్య కూడా రెండు దేశాల ప్రభుత్వాల మధ్య సఖ్యత సాధించి, ఆక్వా రైతులకు కొత్త జీవం పోయడం ప్రశంసనీయం. ఇది భారతదేశానికే గర్వకారణం. ప్రభుత్వ చర్యలతో ఏపీ ఆక్వా రంగం ప్రపంచ  చిత్ర పటంలో మరింత బలంగా నిలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతు క్షేమం కోసం కట్టుబడి ఉంది. ఆక్వా రైతులు ఆర్థికంగా బలంగా ఎదిగేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. నేడు యువనేత చొరవతో అమెరికా సుంకాల కారణంగా ఆర్థికంగా కుదేలైన ఆక్వా రంగం, ఆక్వా రైతులకు ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం ఊరటనిచ్చిందని  తెలిపారు.

అయితే, ఈ అనుమతులు కొన్ని కఠినమైన షరతులకు లోబడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. "ఆస్ట్రేలియా కొన్ని షరతులతో ఒక కన్సైన్‌మెంట్‌కు అనుమతి ఇచ్చింది. వ్యాధి రహిత జోన్లలో సేంద్రియ పద్ధతిలో పెంచిన రొయ్యలను మాత్రమే దిగుమతి చేసుకోవాలనేది కొత్త నిబంధన. రొయ్యలను డీవెయిన్ చేసి, ఫ్రోజెన్ స్థితిలో పంపాలనే పాత షరతులు కూడా ఉన్నాయి" అని ఆక్లాండ్‌కు చెందిన హ్యాస్పర్ బ్రాండ్ ల్యాబ్స్ ప్రతినిధి దిలీప్ మద్దుకూరి వివరించారు. ఈ తాజా పరిణామం అమెరికా మార్కెట్‌లో సవాళ్లను ఎదుర్కొంటున్న ఏపీ రైతులకు కొత్త అవకాశాలను అందిస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
AP Prawns
Nara Lokesh
Andhra Pradesh
Shrimp Exports
Australia
White Spot Virus
Aquaculture
Seafood Industry
Manthena Satyanarayana Raju
Seafood Exports

More Telugu News