Botsa Satyanarayana: త్వరలోనే రాజయ్యపేటకు జగన్ వస్తారు: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana Says Jagan Will Visit Rajayyapeta Soon
  • బల్క్ డ్రగ్ పార్క్‌ వద్దంటూ రాజయ్యపేట మత్స్యకారుల ఆందోళన
  • తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తామని బొత్స హామీ
  • హోంమంత్రి అనిత రాజకీయాల నుంచి తప్పుకోవాలని వ్యాఖ్య
బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనతో అట్టుడుకుతున్న అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ పార్కును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, వారికి సంఘీభావం తెలిపేందుకు వైసీపీ నేతలు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తమ గోడును విన్నవించిన మత్స్యకార మహిళలు.. ఎమ్మెల్సీ, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు.

మత్స్యకారుల సమస్యలను విన్న బొత్స సత్యనారాయణ వారికి భరోసా ఇచ్చారు. త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజయ్యపేటకు వస్తారని, పార్టీ మొత్తం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. "బల్క్ డ్రగ్ పార్క్‌ను వ్యతిరేకిస్తున్న ప్రజలు సంఘ విద్రోహ శక్తులా? ఈ నిర్బంధం ఎందుకు?" అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్ పార్క్‌ను రద్దు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. హోంమంత్రి అనితకు పాలన చేతకాకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలని తీవ్రస్థాయిలో విమర్శించారు. గ్రామస్తుల అభిప్రాయాలను జగన్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలిపారు.

మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్ కూడా ప్రభుత్వంపై, హోంమంత్రి అనితపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు బల్క్ డ్రగ్ పార్క్ వల్ల క్యాన్సర్లు వస్తాయని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారని కన్నబాబు ఆరోపించారు. అనితను గెలిపించినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారని అన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా, 2029లో అధికారంలోకి రాగానే వాటన్నింటినీ ఎత్తివేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ.. వైసీపీ మొదటి నుంచి బల్క్ డ్రగ్ పార్క్‌కు వ్యతిరేకమని గుర్తుచేశారు. "గ్రామంలోకి రావాలంటే పోలీసులు ఆధార్ కార్డులు అడుగుతున్నారు. మరికొన్ని రోజులు పోతే పాస్‌పోర్టులు కూడా అడుగుతారేమో. వందల ఏళ్లుగా ఇక్కడే బతుకుతున్న ప్రజలు ఈ దేశ పౌరులు కారా?" అని ఆయన ప్రశ్నించారు.
Botsa Satyanarayana
Rajayyapeta
Bulk Drug Park
Anakapalli district
fishermen protest
Jagan Mohan Reddy
Kurasala Kannababu
Gudivada Amarnath
Home Minister Anitha

More Telugu News