Btech Ravi: వివేకా కేసులో మరో మలుపు.. జైల్లో దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించిన ఘటనపై బీటెక్ రవి వాంగ్మూలం

Dastagiri Threatened by Chaitanya Reddy Btech Ravi Witness
  • దస్తగిరిని చైతన్యరెడ్డి బెదిరించడం చూశానన్న బీటెక్ రవి
  • ఈ ఘటనపై కర్నూలు ఎస్పీకి వాంగ్మూలం ఇచ్చినట్లు వెల్లడి
  • గతేడాది నవంబర్ 28న ఘటన జరిగిందని స్పష్టీకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని... ఈ కేసు నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలులోనే బెదిరించారని, ఈ ఘటనను తాను ప్రత్యక్షంగా చూశానని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బెదిరింపుల కేసుకు సంబంధించి ఆయన తన వాంగ్మూలాన్ని పోలీసులకు అందజేశారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఈరోజు కడప జైలును సందర్శించారు. దస్తగిరిని బెదిరించిన సమయంలో వేరే కేసులో బీటెక్ రవి కూడా అదే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, సాక్షిగా ఉన్న రవిని ఎస్పీ విచారించి, ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు.

"పోలీసులు విచారణకు పిలవడంతో హాజరై, కర్నూలు ఎస్పీకి నా వాంగ్మూలం ఇచ్చాను. 2023 నవంబర్ 28న దస్తగిరి ఉంటున్న బ్యారక్‌లోకి చైతన్య రెడ్డి వెళ్లడం నేను స్పష్టంగా చూశాను. నా బ్యారక్ సరిగ్గా దానికి ఎదురుగానే ఉంది" అని బీటెక్ రవి తెలిపారు.

"వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న వ్యక్తి బ్యారక్‌లోకి నిందితుడి కుమారుడిని ఎలా అనుమతిస్తారని ఆరోజే జైలు అధికారి ప్రకాశ్‌ను ప్రశ్నించాను. కానీ, అధికారులు నా మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఆరోజు ఏం జరిగిందనేది ఎస్పీకి కూలంకషంగా వివరించాను. జైలుకు వచ్చి మరీ దస్తగిరిని బెదిరించడం వెనుక పెద్ద కుట్ర ఉందని నేను భావిస్తున్నాను" అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. 
Btech Ravi
YS Viveka case
Vivekananda Reddy murder case
Dastagiri
Chaitanya Reddy
Pulivendula TDP
Kurnool SP
Kadapa jail
witness statement
jail threats

More Telugu News