Himanshu Shukla: భారీ వర్షాల ఎఫెక్ట్... నెల్లూరు జిల్లాలో స్కూళ్లకు నేడు సెలవు

Nellore schools closed Wednesday due to heavy rains
  • నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు 
  • జలమయమైన పలు ప్రాంతాల్లోని రహదారులు 
  • వర్షాల పరిస్థితిపై అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న ఉదయం నుంచి కురిసిన వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో, జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం (అక్టోబర్ 22) ఒక రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
 
మండల స్థాయి అధికారులతో వర్షాల పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించిన కలెక్టర్‌.. పోలీసు, రెవెన్యూ విభాగాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర సహాయం కావాలన్నా, కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 0861-2331261, 7995576699 ను సంప్రదించాలని సూచించారు.

నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ, సుబేదారు పేట, వీఆర్సీ సెంటర్‌, కెవిఆర్ పెట్రోల్ బంక్ సెంటర్‌, కొండాయపాలెం గేట్‌, వాహబ్‌పేట‌, శివ ప్రియ సెంటర్‌ ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాలి లోతు నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
 
వర్షం నీటితో కలిసిన మురుగు నీరు వీధుల్లో చేరడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సండే మార్కెట్‌ ప్రాంతంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రోడ్డు పక్కన నిలిపిన వాహనాలు పడిపోయాయి. నగరంలోని పలు అండర్‌ బ్రిడ్జిల కింద వర్షపు నీరు చేరి, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా యంత్రాంగం వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతోంది.
Himanshu Shukla
Nellore
Nellore rains
heavy rains
school holiday
low pressure
Andhra Pradesh
weather
district collector

More Telugu News