Pawan Kalyan: భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ సీరియస్.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి ఆదేశం

Pawan Kalyan Orders Inquiry on Bhimavaram DSP Jayasurya
  • భీమవరం డీఎస్పీ జయసూర్యపై పవన్‌కు ఫిర్యాదులు
  • పేకాట శిబిరాలు, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణలు
  • పశ్చిమ గోదావరి ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన పవన్ కల్యాణ్
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారశైలిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. డీఎస్పీపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరిపి, సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని ఆయన ఆదేశించారు.

భీమవరం డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని, ఆయన నేరుగా సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి పలు ఫిర్యాదులు అందాయి. కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో కూటమి నేతల పేర్లను వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. ఈ ఫిర్యాదుల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న పవన్ కల్యాణ్ నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడారు.

తన దృష్టికి వచ్చిన అంశాలను ప్రస్తావిస్తూ, డీఎస్పీ జయసూర్య పనితీరుపై నివేదిక పంపాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డీఎస్పీ స్థాయి అధికారి అసాంఘిక కార్యకలాపాలకు అండగా నిలవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు సివిల్ వివాదాల జోలికి వెళ్లకుండా చూడాలని, ఇలాంటి చర్యలను కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని సిబ్బందికి తెలియజేయాలని సూచించారు. ప్రజలందరినీ సమానంగా చూస్తూ శాంతిభద్రతలను కాపాడాలని దిశానిర్దేశం చేశారు.

అంతేకాకుండా, భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణల విషయాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, డీజీపీ దృష్టికి కూడా తీసుకెళ్లాలని అధికారులకు పవన్ కల్యాణ్ సూచించారు. 
Pawan Kalyan
Bhimavaram DSP
West Godavari
Jayasurya
Andhra Pradesh Police
Gambling
Civil Disputes
Home Minister Anita
Coalition Government
Law and Order

More Telugu News