India Women's Cricket Team: మహిళల వరల్డ్ కప్.. సెమీస్‌కు భారత్ చేరేనా? లెక్కలు ఇవే!

India Womens Cricket Team World Cup Semifinals Qualification Scenarios
  • మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ముందడుగు
  • నాలుగో సెమీస్ స్థానం కోసం తీవ్ర పోటీ
  • టీమిండియాకు సానుకూలంగా ఉన్న నెట్ రన్‌రేట్
  • భారత్‌కు గట్టిపోటీ ఇస్తున్న న్యూజిలాండ్, శ్రీలంక జట్లు
  • ఇప్పటికే సెమీస్‌కు చేరిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా
మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ బెర్తులు ఖరారు చేసుకోగా, మిగిలిన ఒక్క స్థానం కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలైన భార‌త్‌, తన సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఇకపై ఆడబోయే ప్రతి మ్యాచ్ భారత జట్టుకు అత్యంత కీలకంగా మారింది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో భారత్ 5 మ్యాచ్‌లు ఆడి, రెండింటిలో గెలిచి 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే, ఎల్లుండి న్యూజిలాండ్‌తో, 26న బంగ్లాదేశ్‌తో జరగనున్న మ్యాచ్‌లలో తప్పక గెలవాలి. ఈ రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధిస్తే, ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా భారత్ నేరుగా సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌లలో ఒకదాంట్లో గెలిచి, మరొకటి ఓడిపోయినా భారత్‌కు అవకాశం ఉంటుంది. కానీ, అప్పుడు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. మెరుగైన నెట్ రన్‌రేట్ కీలకం కానుంది. అయితే రెండు మ్యాచ్‌లూ ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయం. ప్రస్తుతానికి భారత్ రన్‌రేట్ పాజిటివ్‌గా ఉండటం ఒక్కటే ఊరటనిచ్చే అంశం.

మరోవైపు న్యూజిలాండ్, శ్రీలంక జట్లు కూడా నాలుగేసి పాయింట్లతో పోటీలో ఉన్నాయి. కివీస్ తన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్‌ను వెనక్కి నెట్టేస్తుంది. బంగ్లాదేశ్‌పై గెలిచిన శ్రీలంక కూడా చివరి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విజయం సాధిస్తే సెమీస్ రేసులో నిలుస్తుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పటికే రేసు నుంచి దాదాపుగా తప్పుకున్నాయి.

ఇలాంటి కీలక దశలో జట్టు ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. గత మూడు మ్యాచ్‌లలోనూ ఒకే రకమైన తప్పులు పునరావృతం చేస్తూ, గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలవుతోంది. హర్మన్‌ప్రీత్ సేన వెంటనే తమ వ్యూహాలను మార్చుకుని, పట్టుదలతో ఆడితేనే విజయాల బాట పట్టగలదు.
India Women's Cricket Team
Women's World Cup
ICC Women's World Cup
Harmanpreet Kaur
New Zealand Women's Cricket Team
Bangladesh Women's Cricket Team
South Africa Women's Cricket Team
England Women's Cricket Team
Cricket
Semi Finals

More Telugu News