Paul Ingrassia: భారతీయుడిని ఎప్పుడూ నమ్మకు.. ట్రంప్ నామినీ జాతి వివక్ష వ్యాఖ్యలు

Paul Ingrassia Racist Remarks Against Indian American Surfaces
  • ట్రంప్ నామినీ పాల్ ఇంగ్రేసియా వివాదాస్పద చాట్ లీక్
  • మార్టిన్ లూథర్ కింగ్‌ను అవమానిస్తూ తీవ్ర వ్యాఖ్యలు
  • తనలో నాజీ భావాలు ఉన్నాయని బహిరంగంగా అంగీకారం
  • నల్లజాతీయులు, భారతీయులపై జాతి వివక్ష కామెంట్స్
  • నియామకాన్ని అడ్డుకుంటామని సెనేట్ మెజారిటీ లీడర్ ప్రకటన
  • కీలక పదవికి ఇంగ్రేసియా నియామకం దాదాపు అసాధ్యం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవికి నామినేట్ చేసిన వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. జాతి వివక్షతో కూడిన ఆయన పాత వ్యాఖ్యలు ఇప్పుడు బయటకు లీక్ కావడంతో, సెనేట్‌లో ఆయన నియామకం దాదాపు అసాధ్యంగా మారింది. ఆఫీస్ ఆఫ్ స్పెషల్ కౌన్సిల్ అధిపతిగా ట్రంప్ నామినేట్ చేసిన పాల్ ఇంగ్రేసియా, గతంలో చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

పాల్ ఇంగ్రేసియా రిపబ్లికన్లతో జరిపిన ఒక గ్రూప్ చాట్‌కు సంబంధించిన వివరాలను పొలిటికో వార్తా సంస్థ బయటపెట్టింది. 2024 మే నెలలో జరిగిన ఒక చర్చ సందర్భంగా, ఒక సభ్యుడు ఇంగ్రేసియాను ‘హిట్లర్ యూత్’ అని వ్యాఖ్యానించగా, దానికి ఇంగ్రేసియా బదులిస్తూ, "అవును, అప్పుడప్పుడు నాలో నాజీ భావాలు బయటకు వస్తుంటాయి. అది నేను ఒప్పుకుంటాను" అని చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.

అంతేకాకుండా, నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్‌ను అవమానిస్తూ కూడా ఇంగ్రేసియా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "మార్టిన్ లూథర్ కింగ్ 1960ల నాటి జార్జ్ ఫ్లాయిడ్. ఆయన పేరిట ఇచ్చే సెలవును రద్దు చేసి పారేయాలి" అని 2024 జనవరిలో వ్యాఖ్యానించారు. నల్లజాతీయులను ఉద్దేశించి ఒక జాత్యహంకార పదాన్ని వాడుతూ.. వారికి సంబంధించిన ఏ సెలవు దినం కూడా ఉండకూడదని, అన్నింటినీ నాశనం చేయాలని అన్నారు.

శ్వేత జాతీయుల ఆధిపత్యాన్ని సమర్థిస్తూ, "నాయకత్వ స్థానాల్లో సమర్థులైన శ్వేత జాతీయులు ఉండాలి. మనుషులందరూ సమానమేనన్న మన పూర్వీకుల ఆలోచన తప్పు. దానిని మనం తిరస్కరించాలి" అని ఇంగ్రేసియా పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిని ఉద్దేశించి, "ఒక చైనీయుడిని గానీ, భారతీయుడిని గానీ ఎప్పటికీ నమ్మవద్దు" అని కూడా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సెనేట్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. సెనేట్ మెజారిటీ లీడర్ జాన్ థూన్ మాట్లాడుతూ "ఆయన నియామకం జరగదు. వైట్‌హౌస్ ఈ నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటుందని ఆశిస్తున్నాను" అని స్పష్టం చేశారు. పలువురు రిపబ్లికన్ సెనేటర్లు కూడా ఇంగ్రేసియా నియామకాన్ని వ్యతిరేకిస్తుండటంతో, కీలక పదవికి ఆయన ఎంపిక దాదాపుగా ముగిసినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Paul Ingrassia
Donald Trump
racist comments
Martin Luther King Jr
Vivek Ramaswamy
Office of Special Counsel
US Politics
Republican Party
John Thune
racism

More Telugu News