Cristiano Ronaldo: భారత ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. గోవాకు రాని క్రిస్టియానో రొనాల్డో!

Cristiano Ronaldo Goa Visit Cancelled Big Shock for Indian Fans
  • గోవాతో ఏఎఫ్‌సీ ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్‌కు గైర్హాజరు
  • పనిభారం కారణంగానే విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయం
  • రొనాల్డో లేకుండానే గోవాకు రానున్న అల్ నస్రీ జట్టు
భారత ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణానికి తెరపడింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో భారత్ కు రాలేదు. ఏఎఫ్‌సీ ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా ఎఫ్‌సీ గోవాతో జరగాల్సిన మ్యాచ్ కోసం ఆయన భారత్‌కు రావడం లేదని స్పష్టమైంది. ఈ వార్తతో రొనాల్డో ఆటను ప్రత్యక్షంగా వీక్షించాలని ఆశపడిన వేలాది మంది అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఏఎఫ్‌సీ ఛాంపియన్స్ లీగ్ 2లో భాగంగా గోవా ఎఫ్‌సీతో జరగాల్సిన మ్యాచ్‌కు రొనాల్డో దూరంగా ఉంటున్నాడు. వరుస మ్యాచ్‌ల కారణంగా తీవ్రమైన పనిభారం పెరగడంతో విశ్రాంతి తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తన క్లబ్ అల్ నస్రీ యాజమాన్యానికి స్పష్టం చేసినట్లు సమాచారం. యాజమాన్యం నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా, రొనాల్డో తన నిర్ణయానికే కట్టుబడినట్లు సమాచారం.

రొనాల్డో రాకపోయినా, అల్ నస్రీ జట్టు మాత్రం షెడ్యూల్ ప్రకారమే భారత్‌కు విచ్చేసింది. 28 మంది సభ్యులతో కూడిన ఈ బృందం గోవాకు చేరుకుంది. బుధవారం స్థానిక నెహ్రూ స్టేడియంలో గోవా ఎఫ్‌సీతో అల్ నస్రీ తలపడుతుంది.

ఏఎఫ్‌సీ ఛాంపియన్స్ లీగ్ 2025-26 సీజన్ డ్రాలో అల్ నస్రీ, ఎఫ్‌సీ గోవా జట్లు రెండూ గ్రూప్ ‘డి’లో చోటు దక్కించుకోవడంతో రొనాల్డో భారత్‌కు రావడం ఖాయమని అందరూ భావించారు. సౌదీ ప్రో లీగ్‌లో మూడో స్థానంలో నిలిచిన అల్ నస్రీ ఈ టోర్నీకి అర్హత సాధించగా, ఇండియన్ సూపర్ లీగ్‌లో సత్తా చాటిన ఎఫ్‌సీ గోవా ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌లో ఆడే అవకాశాన్ని సొంతం చేసుకుంది.

ఈ లీగ్‌లో రొనాల్డో లేకుండానే అల్ నస్రీ గత రెండు మ్యాచ్‌లలో విజయం సాధించడం గమనార్హం. అయినప్పటికీ, తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసే అవకాశం చేజారిపోవడంతో భారత ఫుట్‌బాల్ ప్రియులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 
Cristiano Ronaldo
Ronaldo
Al Nassr
FC Goa
AFC Champions League
Indian Football
Goa
Football
Soccer

More Telugu News