Greg Abbott: టెక్సాస్ గవర్నర్ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు.. 11 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం

Greg Abbott hosts Diwali celebration honoring Indian Americans in Texas
  • టెక్సాస్ గవర్నర్ అధికారిక నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు
  • ప్రవాస భారతీయులకు ఆతిథ్యమిచ్చిన గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు
  • గత 11 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఈ పండుగను నిర్వహిస్తున్న గవర్నర్
  • టెక్సాస్ అభివృద్ధిలో భారతీయుల పాత్రను కొనియాడిన గ్రెగ్ అబ్బాట్
  • ప్రత్యేక అతిథిగా హాజరైన భారత కాన్సల్ జనరల్ డి.సి మంజునాథ్
  • వేడుకల్లో పాల్గొన్న పలువురు ప్రముఖ ప్రవాసాంధ్రులు
డాలస్: టెక్సాస్ రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసం దీపావళి వేడుకలతో వెలిగిపోయింది. గవర్నర్ గ్రెగ్ అబ్బాట్, ఆయన సతీమణి సిసిలీయా అబ్బాట్ రాష్ట్రంలోని పలువురు ప్రవాస భారతీయ ప్రముఖులను ఆహ్వానించి, అత్యంత ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు. గత 11 సంవత్సరాలుగా ప్రతి ఏటా గవర్నర్ దంపతులు తమ నివాసంలో దీపావళి వేడుకలను నిర్వహించడం ఒక సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు.

ఈ వేడుకల్లో భాగంగా గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ దంపతులు సంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. టెక్సాస్ రాష్ట్ర వేగవంతమైన అభివృద్ధిలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు. పండుగ శుభాకాంక్షలు తెలిపి, వేడుకలకు వచ్చిన అతిథులను ఆప్యాయంగా పలకరించారు. అందరితో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం రుచికరమైన భారతీయ వంటకాలతో విందు ఏర్పాటు చేసి, అందరికీ దీపావళి కానుకలు అందించి సాదరంగా వీడ్కోలు పలికారు.

ఈ ఏడాది వేడుకల ఏర్పాట్లను ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు సమన్వయం చేశారు. భారత కాన్సల్ జనరల్ డి.సి మంజునాథ్ దంపతులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో వంటి పలు నగరాల నుంచి 100 మందికి పైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. వీరిలో డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ గొట్టిపాటి, సతీష్ మండవ, నీలిమ గోనుగుంట్ల తదితర ప్రవాసాంధ్రులు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ, భారత్-అమెరికా సంబంధాల బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న గవర్నర్ గ్రెగ్ అబ్బాట్‌కు ప్రవాస భారతీయుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. గతంలో డాలస్‌లో జరిగిన మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
Greg Abbott
Texas
Diwali
Indian Americans
Governor of Texas
Prasad Thotakura
India US relations
Anurag Jain
Dallas

More Telugu News