Benjamin Netanyahu: భారత పర్యటనకు వస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

Benjamin Netanyahu to Visit India Bolstering Ties
  • ఈ ఏడాది చివరిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్ పర్యటన ఖరారు
  • అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా భారత్‌తో సత్సంబంధాల మెరుగుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుండంటూ అంతర్జాతీయ మీడియా కథనాలు
  • నెతన్యాహు భారత్ పర్యటన సందర్భంగా పలు కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ఛాన్స్
భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలలో మరో కీలకమైన ముందడుగు పడనుంది. ఈ సంవత్సరం చివరిలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత్ పర్యటనకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా, భారత్, రష్యా వంటి దేశాలపై టారిఫ్‌ల పేరుతో ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు హమాస్‌తో యుద్ధం కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ఆ ఒత్తిడికి తలొగ్గి ఇజ్రాయెల్ తాత్కాలికంగా కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే, హమాస్ పూర్తిగా లొంగిపోకపోతే గాజాలో యుద్ధం ఆగదని నెతన్యాహు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా భారత్‌తో సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రధాని పర్యటనకు సిద్ధమవుతున్నారనే వార్తలు అంతర్జాతీయ మీడియాలో రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నెతన్యాహు భారత్ పర్యటన సందర్భంగా శాస్త్ర సాంకేతిక రంగం, అంతరిక్ష పరిశోధన, రక్షణ, వ్యవసాయం, నీటి నిర్వహణ, వాణిజ్యం వంటి కీలక రంగాల్లో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదివరకే భారత్-ఇజ్రాయెల్ మధ్య రక్షణ రంగంలో పలు సహకార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

భారత్ ఒకవైపు గాజా ప్రజలకు మానవతా సహాయం అందిస్తూ, మరోవైపు ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా సమతుల్యమైన దౌత్యాన్ని కొనసాగిస్తోంది. 
Benjamin Netanyahu
Israel
India
Netanyahu India visit
India Israel relations
Israel Prime Minister
India Israel defense cooperation
Gaza conflict
India foreign policy
Israel India trade

More Telugu News