Harish Rao: చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హరీశ్ రావు

Harish Rao Visits Bhagyalakshmi Temple on Diwali
  • అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్న హరీశ్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి
  • ఒక రౌడీషీటర్ కానిస్టేబుల్‌ను చంపడం దురదృష్టకరమన్న హరీశ్ రావు
  • మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్న మాజీ మంత్రి
దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు దర్శించుకున్నారు. హరీశ్ రావుతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మవారి ఆశీర్వాదంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.

హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలో పోలీసులకు కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రౌడీషీటర్ కానిస్టేబుల్‌ను చంపడం దురదృష్టకరమని అన్నారు. ముఖ్యమంత్రి చేతిలోనే హోంశాఖ ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. మరణించిన కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని కోరారు. కానిస్టేబుల్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మంత్రివర్గ సమావేశంలో ఏం జరిగిందో ప్రత్యేకంగా తాను చెప్పాల్సిన పని లేదని హరీశ్ రావు అన్నారు. స్వయానా మంత్రి కుమార్తెనే చెప్పిందని గుర్తు చేశారు. ఎలాంటి తప్పు చేయకుంటే పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గూండారాజ్యంగా మార్చిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో పెట్టుబడులను ఆకర్షిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తుపాకులు పెట్టి పెట్టుబడిదారులను భయపెడుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు.
Harish Rao
Bhagyalakshmi Temple
Charminar
Telangana Politics
BRS Party
Kotha Prabhakar Reddy

More Telugu News